తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కు వెళ్లిన నాగార్జున
నట సామ్రాట్ తనయుడు, యువ సామ్రాట్ గా పిలవబడ్డ మన్మథుడు అక్కినేని నాగార్జున ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన కుటుంబ సభ్యులందరినీ వెంటతీసుకువెళ్లారు. భార్య అమల, కొడుకు నాగచైతన్య, కోడలు శోభిత ధూళిపాళ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులున్నారు. అక్కినేని నాగేశ్వరరావుపై యార్లగడ్డ 'అక్కినేనిగా విరాట్ వ్యక్తిత్వ' పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని నరేంద్రమోడీకి బహుమతిగా నాగార్జున అందజేశారు. గత ఆదివారం మన్ కీ బాత్ లో మోడీ మాట్లాడుతూ భారతీయ సినీ రంగానికి కృషిచేసిన రాజ్ కపూర్, అక్కినేని నాగేశ్వరరావు, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాకు నివాళులర్పించారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సమ్మిట్ కోసం సలహాదారుగా తెలుగు నుంచి చిరంజీవితోపాటు నాగార్జున కూడా నియమితులయ్యారు. ఈ ఏడాది చివరలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది.
టీడీపీ ఎంపీలతో ఫొటోలు
ప్రధానమంత్రికి తన కుటుంబ సభ్యులందరినీ నాగార్జున పరిచయం చేశారు. ఈ సందర్భంగా శోభిత కొండపల్లి బొమ్మను మోడీకి జ్ఞాపికగా అందజేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో వీరంతా ప్రధానమంత్రిని కలిశారు. అక్కడకు వెళ్లిన సందర్భంగా నాగార్జున పార్లమెంటు కార్యాలయంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న పార్టీ ఎంపీలు, ఇతర నేతలతో మాట్లాడారు. పలువురు ఎంపీలు నాగార్జున కుటుంబంతో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నాగార్జున కుటుంబంతో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టారు.

జగన్ కు అత్యంత సన్నిహితుడు
అక్కినేని నాగార్జున తెలుగుదేశం పార్టీకి చాలా దూరం అనే సంగతి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలతోపాటు వ్యాపార సంబంధాలున్నాయి. అంతేకాకుండా సినీ రంగంలో బాలకృష్ణతో విభేదాలున్నాయి. ఇవి ఎందుకు వచ్చాయనేది వారిద్దరికే తెలియాలి. ఒక్కసారిగా నాగార్జున తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లడం, అక్కడి పార్టీ నేతలతో ఫొటోలు దిగడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications