వారిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తలుపు తట్టారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై దాఖలైన కేసును కొట్టేయాలంటూ పిటిషన్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారించే అవకాశం ఉంది. నంద్యాలలో వైసీపీ తరఫున పోటీచేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించేందుకు ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. ఆ సమయంలో ఊరేగింపు జరగడం, ర్యాలీల్లాంటివి జరిగాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు.
తారస్థాయికి చేరిన విభేదాలు
అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సమయంలోనే మెగా కుటుంబ సభ్యులంతా పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ కు మద్దతుగా అందరూ అక్కడికే వెళ్లారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా పిఠాపురంలోనే ప్రచారం నిర్వహించారు. అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ తో సరిపెట్టారు. మీ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నానన్నారు. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా అంతే.. కేవలం ట్వీట్ తో మమ అనిపించారు. అప్పటికే మెగా కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ కు ఉన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో బన్నీపై విరుచుకుపడ్డారు. దీంతో ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప2 సినిమాను నిర్మాతలు వాయిదా వేసుకున్నారు.

గతంలో కూడా ఇలాగే జరిగితే..
గతంలో కూడా పవన్ అభిమానులతో, మెగా అభిమానులతో గొడవలు రేకెత్తినప్పుడు విడుదల చేసిన 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా కూడా అట్టర్ ఫ్లాపైంది. దీనికి కారణం మెగా అభిమానులు ఈ సినిమాను బాయ్ కాట్ చేయడమే. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప2ను కూడా అలాగే బాయ్ కాట్ చేస్తే భారీ నష్టం తథ్యమని భావించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈలోగా దర్శకుడు సుకుమార్ తీసిన సన్నివేశాలు సరిగా రాలేదనే ఉద్దేశంతో మళ్లీ మళ్లీ తీస్తున్నారు. ఇంతవరకు ప్రత్యేక గీతంలో నర్తించే హీరోయిన్ ను ఎంపిక చేయలేదు. డిసెంబరు ఆరోతేదీన పుష్ప2 విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications