అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు?
టాలీవుడ్ జేజమ్మ, స్వీటీ అనుష్క శెట్టి వివాహం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె వ్యక్తిగత బృందం (Team Anushka) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా ఆమె ఒక వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ.. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. కేవలం వ్యూస్ కోసం ఒకరి వ్యక్తిగత జీవితాన్ని సెన్సేషనలైజ్ చేయడం సరికాదని హితవు పలికింది.
అనుష్క టీమ్ విడుదల చేసిన ప్రకటనలో ప్రధానంగా ఆమె వయసు గురించి జరుగుతున్న చర్చను తప్పుపట్టింది. "ప్రతి పోస్ట్‌లోనూ '44' అనే నంబర్‌ను ఏదో వివాదాస్పద అంశంలా ఎందుకు హైలైట్ చేస్తున్నారు? వయసు అనేది ఒక సమస్య అయితే.. ఇదే ఉత్సాహం సీనియర్ హీరోల వయసు విషయంలో ఎందుకు కనిపించడం లేదు?" అని ప్రశ్నించింది. కేవలం మహిళా నటీమణులను టార్గెట్ చేస్తూ వయసును, వ్యక్తిగత నిర్ణయాలను తక్కువ చేసి చూపడం వివక్షతో కూడిన చర్యని టీమ్ పేర్కొంది.

ప్రతిభతో ఎదిగారు.. పీఆర్ స్టంట్స్ అవసరం లేదు!
అనుష్క తన సినీ కెరీర్‌ను కేవలం ప్రతిభ, కష్టార్జితంతో హుందాగా నిర్మించుకున్నారని, ఆమె ఎప్పుడూ చీప్ పబ్లిసిటీ లేదా పీఆర్ (PR) స్టంట్స్‌పై ఆధారపడలేదని టీమ్ గుర్తు చేసింది. తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే ఆమె హక్కును గౌరవించాలని కోరింది. "వివాహం అనేది ఒక వ్యక్తిగత విషయం. అది బ్రేకింగ్ న్యూసో, సోషల్ మీడియా ట్రెండో కాదు. ప్రచురించే ముందు నిజాన్ని నిర్ధారించుకోవడం కనీస బాధ్యత" అని స్పష్టం చేసింది.
హీరోలతో సమానంగా గౌరవించండి!
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే గౌరవాన్ని హీరోయిన్లకు కూడా ఇవ్వాలని అనుష్క టీమ్ డిమాండ్ చేసింది. ఒక నటిగా ఆమె సాధించిన విజయాలను కాకుండా, కేవలం పెళ్లి, వయసు వంటి అంశాలనే పదేపదే హైలైట్ చేయడం అన్యాయమని పేర్కొంది. ఇకనైనా హద్దులను గౌరవించి, నిరాధారమైన వార్తలకు స్వస్తి పలకాలని మీడియా సంస్థలకు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం అనుష్క తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పెళ్లికి సంబంధించి ఏదైనా విశేషం ఉంటే తామే అధికారికంగా వెల్లడిస్తామని, అప్పటివరకు ఊహాగానాలను నమ్మవద్దని అభిమానులకు సూచించింది.












Click it and Unblock the Notifications