నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్: హైకోర్టు కీలక ఆదేశాలు!
టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన వ్యక్తిగత గోప్యతను, హక్కులను కాపాడాలని కోరుతూ టాలీవుడ్ హీరో నాగచైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన అనుమతి లేకుండా తన పేరు, గొంతు, ఫోటోలు, ముఖ రూపాన్ని ఇంటర్నెట్‌లో ఇష్టారాజ్యంగా వాడుకుంటూ వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తున్నారంటూ నాగచైతన్య దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. నాగచైతన్య అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. నాగచైతన్య వ్యక్తిగత హక్కులను అత్యవసరంగా రక్షించాలంటూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఇందుకు కారణమైన పలు సంస్థలకు, వెబ్‌సైట్లకు అధికారికంగా సమన్లు జారీ చేసింది.
ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు.. నాగ చైతన్య వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగచైతన్య లీగల్ టీమ్ కోరిన 'డైనమిక్ ఇంజంక్షన్' అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ చట్టపరమైన నిబంధన ద్వారా, భవిష్యత్తులో నాగ చైతన్య ప్రతిష్టను దెబ్బతీసేలా ఎలాంటి తప్పుడు కంటెంట్ ఆన్‌లైన్‌లోకి వచ్చినా.. ప్రతిసారీ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అతని టీమ్ నేరుగా ఆయా ప్లాట్‌ఫారమ్‌ల నుండి వాటిని తక్షణమే తొలగించే అవకాశం లభిస్తుంది.

అశ్లీల వెబ్‌సైట్లలో పేరు.. వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్!
విచారణ సందర్భంగా నాగ చైతన్య తరఫు న్యాయవాది ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఘోరమైన డిజిటల్ ఉల్లంఘనలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చైతన్య గుర్తింపును కొన్ని అశ్లీల డొమైన్ నేమ్స్‌లో, సెర్చ్ ట్యాగ్స్‌లో వాడడమే కాకుండా.. అతని అనుమతి లేకుండా కమర్షియల్ ప్రొడక్ట్స్‌ను అమ్ముకుంటున్నారని వెల్లడించారు. వీటన్నింటికీ మించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ ద్వారా క్రియేట్ చేసిన డీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్-క్లోనింగ్ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి నాగ చైతన్య గత వైవాహిక బంధం, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ యూట్యూబ్‌లో అసభ్యకరమైన థంబ్ నెయిల్స్, నిందాపూర్వక వీడియోలతో విపరీతంగా ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని న్యాయవాది ధర్మాసనానికి వివరించారు.
గూగుల్, యూట్యూబ్‌లకు కోర్టు ఆదేశాలు
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జ్యోతి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు లేదా పబ్లిక్ ఫిగర్లపై ప్రజల్లో నిరంతరం నిఘా, విమర్శలు ఉండడం సహజమే అయినప్పటికీ.. ఆ స్వేచ్ఛకు ఖచ్చితమైన చట్టపరమైన పరిమితులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజాలైన గూగుల్, యూట్యూబ్ సంస్థలకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ వివాదాస్పద కంటెంట్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications