సీఎంగా NTR! ఫ్యాన్స్ కు క్లాస్: యంగ్ టైగర్ న్యూ లుక్ వైరల్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజ్ ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తారక్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాన్స్ ఒక సునామీ సృష్టించాల్సిందే. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టిన వీడియోలు వైరల్ గా మారాయి.
బెంగళూరులోని కిమ్స్ (KIMS) హాస్పిటల్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ వస్తున్నారన్న చిన్న సమాచారంతో ఆదివారం ఉదయం నుంచే బెంగళూరు వీధులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. హాస్పిటల్‌కు వెళ్లే దారులన్నీ కిలోమీటర్ల మేర స్తంభించిపోయాయి. కర్ణాటకలో కూడా ఎన్టీఆర్‌కు ఈ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉండటం చూసి స్థానిక నెటిజన్లు, నిర్వాహకులు ఆశ్చర్యపోయారు.

హోరెత్తిన నినాదాలు.. విరిగిపోయిన ఎస్కలేటర్..
తారక్ హాస్పిటల్‌లోకి అడుగుపెడుతున్న సమయంలో అభిమానుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. వేలాది మంది ఫ్యాన్స్ లోపలికి చొచ్చుకురావడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో హాస్పిటల్‌లోని కొత్త ఎస్కలేటర్ అద్దం పగిలిపోవడంతో పాటు రిసెప్షన్‌లోని ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. పరిస్థితిని అదుపు చేయడం పోలీసులకు సైతం కష్టసాధ్యంగా మారింది. ఇక అక్కడ వినిపించిన "సీఎం సీఎం", "బాబులకే బాబు.. మా తారక్ బాబు" అనే నినాదాలు ఆ ప్రాంతాన్ని హోరెత్తించాయి. ఇన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నా, అభిమానులు మాత్రం ఆయన్ని తమ కాబోయే నాయకుడిగా చూస్తున్నారనడానికి ఈ నినాదాలే నిదర్శనం.
స్టేజ్ పై NTR.. ఫ్యాన్స్ కు షాక్..
కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన అనుబంధాన్ని పంచుకున్నారు. "కర్ణాటకకు రావడం అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లు ఉంటుంది. 1983లో మా తాతగారు (NTR) ఇక్కడ శంకుస్థాపన చేశారు, మళ్ళీ అదే మార్చి నెలలో నేను రావడం నా పూర్వజన్మ సుకృతం" అని భావోద్వేగానికి గురయ్యారు. అయితే, అభిమానుల అతి ఉత్సాహం చూసి తారక్ తన స్టైల్‌లో క్లాస్ తీసుకున్నారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేయగా.. క్వైట్ క్వైట్ అంటూ గట్టిగా చెప్పారు. అనంతరం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని హితవు పలికారు. ఒకవేళ డాక్టర్ అయితే దేనిలో స్పెషలిస్ట్ అయ్యేవారు అని అడగ్గా.. తనకు పిల్లలంటే ఇష్టమని, అందుకే "పీడియాట్రిషియన్" అయ్యేవాడినని నవ్వుతూ బదులిచ్చారు.
తాత బాటలో తారక్.?#JrNTR #NTR #SrNTR #ReelTalk #OITelugu pic.twitter.com/poXbF6NIb5
— oneindiatelugu (@oneindiatelugu) March 8, 2026
'డ్రాగన్' లుక్ తో అదిరిపోయే ఎంట్రీ..
గత ఆరు నెలలుగా మీడియాకు దూరంగా ఉండి, దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కోసం సిద్ధమవుతున్న తారక్, ఈ ఈవెంట్లో తన సరికొత్త లుక్‌ను రివీల్ చేశారు. గడ్డం పెంచి, చెవికి రింగ్ పెట్టుకుని చాలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. గతంలో కాస్త బక్కగా కనిపించిన ఎన్టీఆర్, ఇప్పుడు 'డ్రాగన్' (Dragon) సినిమా కోసం ఫిట్‌గా మారి మునుపటి తేజస్సుతో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మే 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంది.
నారా-నందమూరి గ్యాప్ ఉన్నా తగ్గని మేనియా..
రాజకీయంగా, కుటుంబ పరంగా ఎన్టీఆర్ కొంత దూరం పాటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆయన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని బెంగళూరు పర్యటన నిరూపించింది. తిరిగి వెళ్లే సమయంలో కూడా జనసందోహం తగ్గకపోవడంతో, తారక్ తన కారు టాప్ పైకి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాల్సి వచ్చింది. మొత్తానికి 'దేవర' రాక కంటే ముందే, తన గ్లోబల్ మేనియాతో తారక్ మరోసారి బాక్సాఫీస్ వద్దే కాదు, జనాల్లోనూ తనదే అగ్రస్థానం అని చాటిచెప్పారు.












Click it and Unblock the Notifications