ఏప్రిల్ వార్: రాజాసాబ్ vs జాట్
టాలీవుడ్ డైరెక్టర్, బాలీవుడ్ స్టార్ హీరో.. వీళ్ల కాంబోలో సినిమా పడితే బ్లాక్ బస్టర్ ఖాయం. అవును ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా.. ఆ సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో తీసి అక్కడా బ్లాక్ బస్టర్ విక్టరీ కొట్టాడు. ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ ప్రధాన పాత్రలో యానిమల్ మూవికి దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద యానిమల్ దాదాపు రూ. 900 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లోనూ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించాడు.
ఇప్పుడు ఆ లిస్ట్ లో టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని చేరాడు. డాన్ శీను, క్రాక్, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న క్రేజీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో జాట్ అనే హై యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఆ మధ్య రిలీజైన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక గదర్:ఏక్ ప్రేమ్ కథా, గదర్ 2 చిత్రాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సన్నీ డియోల్.. ఈ చిత్రంలో పవర్ పుల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మరి జాట్ మూవీతో గోపిచంద్ మలినేని పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడో లేదో చూడాలి.
ఏప్రిల్ 10 వార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ కూడా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డైరెక్టర్ మారుతీ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ తోపాటు సంజయ్ దత్, మాలవికా మోహన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి బాక్సాఫీస్ దంగల్ తప్పేలా లేదు. అయితే 'రాజాసాబ్' మూవీ వాయిదా పడుతోంది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చినా.. మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.












Click it and Unblock the Notifications