'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ!
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' రికార్డులు సృష్టిస్తోంది. కానీ తాజాగా తమిళనాడులో ఈ సినిమా చిక్కుల్లో పడింది. కొన్ని రోజుల్లోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఎన్నికల సమయంలో ప్రదర్శించకుండా నిషేధించాలంటూ ఓ లాయర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నికల సమయంలో ధురంధర్ ప్రభావం?
తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 23, 2026న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 'ధురంధర్' వంటి సినిమాను ప్రదర్శించడం వల్ల ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆ న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా ఓ నిర్దిష్ట రాజకీయ దృక్పథాన్ని ప్రోత్సహించేలా ఉందని.. ఇది ఎన్నికల నిష్పాక్షికతను దెబ్బతీస్తుందని లాయర్ వాదించారు. ఇప్పటికే కొందరు విమర్శకులు ఈ చిత్రాన్ని కేవలం వినోదం కోసమే మాత్రమే కాకుండా.. ఓ పెద్ద స్థాయి రాజకీయ ప్రచారంలా ఉందని విమర్శిస్తున్నారు.

న్యాయస్థానం స్పందన ఏమిటంటే?
ఈ కేసును మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి.అరుళ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే సినిమాపై తక్షణమే నిషేధం విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై సరైన పద్ధతిలో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు న్యాయవాదిని ఆదేశించారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ కేసును మళ్లీ విచారణకు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. పిటిషన్ దాఖలైన వెంటనే వేగంగా విచారణ జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుత పరిస్థితి ఇలా..
న్యాయస్థానం నుంచి తుది నిర్ణయం వచ్చే వరకు 'ధురంధర్'థియేటర్లలో తన ప్రదర్శనను కొనసాగించనుంది. కేవలం హిందీలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఒకవేళ కోర్టు ఎన్నికల దృష్ట్యా నిషేధం విధిస్తే. అది చిత్ర యూనిట్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications