రమ్యకృష్ణ ఆ సీన్ చేయనని ఏడ్చింది.. కానీ !
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి రమ్యకృష్ణ. 1970 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించిన ఆమె, బాల్యం నుంచే భరతనాట్యంలో శిక్షణ పొంది, మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. 1984లో తమిళ చిత్రం 'వెలైకారన్'తో హీరోయిన్‌గా పరిచయమై, తెలుగులో 'భలే మిత్రులు' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
ఆ తర్వాత తనదైన శైలిలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. 80వ దశకంలో స్టార్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి వంటివారితో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌లో 260కి పైగా చిత్రాలలో నటించి సత్తా చాటారు.

హీరోయిన్‌గా మొదలుకొని పవర్‌ఫుల్ విలన్, కేరక్టర్ ఆర్టిస్ట్, తల్లిపాత్రల వరకు విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన పాత్ర అంటే 2000లో వచ్చిన రజనీకాంత్ చిత్రం 'నరసింహ' (తమిళంలో 'పడయప్ప')లో 'నీలాంబరి' అని చెప్పాలి. ఆ క్యారెక్టర్ ఆమెకు పాన్-సౌత్ స్థాయిలో విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో రమ్యకృష్ణ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాల్సిందే. ఆ పాత్ర గురించి ఆ మూవీ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు.
రవికుమార్ మాట్లాడుతూ.. 'నీలాంబరి' పాత్ర కోసం మొదట మీనా పేరును కొందరు సూచించారని చెప్పారు. అయితే ఆ పాత్రకు కావాల్సిన 'కన్నింగ్ లుక్', 'స్ట్రాంగ్ ఆటిట్యూడ్' మీనా ముఖంలో ఉండే పసితనంతో కుదరదని తాను భావించానని వివరించారు. నగ్మా, రమ్యకృష్ణ అయితే బాగుంటుందని తాను సూచించగా, చివరికి రమ్యకృష్ణ ఆ పాత్రకు అంగీకరించారని తెలిపారు.
అయితే సినిమాలో ఒక సన్నివేశంలో నీలాంబరి తన పాదంతో సౌందర్య చెంపను తాకాల్సి ఉంటుంది. ఈ సీన్ చేయడానికి రమ్యకృష్ణ ఎంతో ఇబ్బంది పడి, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని రవికుమార్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు సౌందర్యే ముందుకు వచ్చి 'ఏం పర్వాలేదు' అని ధైర్యం చెప్పి.. తన పాదాన్ని చెంప దగ్గర పెట్టుకున్నారని అలా ఆ సీన్ పూర్తయిందని చెప్పారు.

అంతే కాకుండా రజనీకాంత్‌తో తన అనుబంధాన్ని గురించి కూడా పంచుకున్నారు రవికుమార్. ఆయన దర్శకత్వం వహించిన 'నాట్టమై' అనే తమిళ చిత్రం తెలుగులో మోహన్‌బాబు హీరోగా 'పెదరాయుడు'గా రీమేక్ అయి రికార్డు స్థాయి విజయం సాధించింది. ఆ సమయంలో రజనీకాంత్‌తో తనకు పరిచయం లేదని రవికుమార్ తెలిపారు.
'నాట్టమై' విజయం తర్వాత రజనీకాంత్ తనను పిలిపించి కథ సిద్ధం చేయమన్నారని.. అలా తయారైన కథే 'ముత్తు' అని చెప్పారు. ఆ సినిమా తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ సంచలన విజయం సాధించడంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని వివరించారు. 'ముత్తు' తర్వాత రజనీకాంత్‌తో కలిసి 'నరసింహ', 'లింగ' వంటి చిత్రాలను తెరకెక్కించానని, వాటిలో 'నరసింహ' రికార్డు స్థాయి వసూళ్లు సాధించిందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications