ఎల్‌పీజీపై తేల్చి చెప్పిన ప్రధాని మోదీ: 2014 ముందు నాటి పరిస్థితులకు లింక్
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా ఈ రెండు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణల నేపథ్యంలో క్రూడాయిల్ ధర నెల రోజుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ తాజా పరిణామాలు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను మళ్లీ నష్టాలపాలు చేస్తోన్నాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
ఈ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. హర్యానాలోని జింద్‌లో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశ ఇంధన భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఇంధన సరఫరా స్తంభించిపోతున్నప్పటికీ.. దేశం సురక్షితంగా ఉండటానికి గల కారణాల గురించి వివరించారు. ఈ ఉదయం జింద్ లో హైడ్రోజన్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.

దేశానికి అవసరమైన పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్, వ్యవసాయానికి అత్యంత కీలకమైన రసాయన ఎరువులు ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి మార్గం ద్వారానే రవాణా అవుతాయని గుర్తు చేశారు. గత మూడు, నాలుగు నెలలుగా ఈ సముద్ర రవాణా మార్గం మొత్తం కూడా అస్థిరంగా మారిందని, నిరంతరం ఘర్షణలతో యుద్ధ క్షేత్రంగా మారిపోయిందని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితులు అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అయినప్పటికీ.. దీని ప్రభావం భారత్, ప్రజలపై పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఇంధన అవసరాలలో అత్యధిక శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉండటం వల్ల, అంతర్జాతీయంగా తలెత్తే ఇటువంటి సంక్షోభాలు సామాన్య ప్రజానీకాన్ని నేరుగా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, తమ ముందుచూపుతో దీన్ని నివారించామని పేర్కొన్నారు. 2014 తర్వాత ఇంధన భద్రతపై ముందస్తు వ్యూహాలతో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశాన్ని ఇబ్బందుల నుంచి కాపాడుతున్నాయని అన్నారు.
2014 కంటే ముందు ఈ సంక్షోభం ఎదురై ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో కూడా ప్రధాని మోదీ వివరించారు. 2014 కంటే ముందు దేశంలో ఇలాంటి అంతర్జాతీయ చమురు సంక్షోభం సంభవించి ఉంటే, రైల్వే నెట్ వర్క్ పూర్తిగా కుప్పకూలిపోయేదని అన్నారు. ఆ కాలంలో దేశంలో నడిచే అత్యధిక శాతం రైళ్లు దిగుమతి చేసుకునే డీజిల్ ఆధారంగానే నడిచేవని, ఆ సమయంలో చమురు రవాణా నిలిచిపోయి ఉంటే దేశవ్యాప్తంగా ప్రజారవాణా, సరుకు రవాణా పూర్తిగా నిలిచిపోయి తీవ్రమైన ఆర్థిక స్థంభన ఏర్పడేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టామని, పదేళ్ల కాలంలో రైల్వేను వంద శాతం విద్యుద్దీకరణ దిశగా నడిపించామని మోదీ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం బ్రాడ్ గేజ్ రైల్వే మార్గాలలో దాదాపు 95 శాతానికి పైగా విద్యుద్దీకరణ పనులను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ మార్పుల వల్ల రైల్వే శాఖ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోగలిగిందని, ఫలితంగా అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం రైళ్లపై పడకుండా నివారించగలిగామని ప్రధాని స్పష్టం చేశారు.
రైల్వేను పూర్తిగా కాలుష్య రహితంగా, స్వయం సమృద్ధిగా మార్చేందుకు క్షేత్రస్థాయిలో అనేక ఆచరణాత్మక పరిష్కారాలను అమలు చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎలక్ట్రిఫికేషన్ వరకు మాత్రమే పరిమితం కాకుండా, సౌర విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.














Click it and Unblock the Notifications