పుల్ల కంద, కోడిగుడ్ల పులుసు.. ఇలా చేస్తే లొట్టలేసి తింటారు!
మనం నిత్యం అనేక రకాల వంటలు రుచి చూస్తాం. అయితే అప్పుడప్పుడు పులుసులు కూడా రుచి చూస్తే బాగుంటుంది. అలాంటి పులుసులలో రుచికరమైన పుల్ల కంద ఎగ్ పులుసు సూపర్ టేస్ట్ తో అదిరిపోతుంది.
కావలసిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు - 4
కంద - పావు కేజీ (ఉప్పు, పసుపు వేసిన నీటిలో నానబెట్టాలి)
ఉల్లిపాయలు - 2 (మధ్యస్థం, బాగా సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 2 లేదా 3
నూనె - సరిపడా
పోపు గింజలు - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - తగినంత
కారం - 1 1/2 టీస్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
చింతపండు రసం - 25 నుంచి 30 గ్రాములు
జీలకర్ర,మెంతుల పొడి - టీస్పూన్
ధనియాల పొడి - 1 స్పూన్
కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం
మొదట ఉడికించిన 4 గుడ్లను తీసుకుని, పాన్‌లో కొద్దిగా నూనె వేసి గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లేదా కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి, పోపు గింజలు మరియు కరివేపాకు వేసి చిటపటలాడించాలి. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. అందులో కంద ముక్కలను వేసి కలిపి మూత పెట్టి మీడియం మంటపై 5 నిమిషాలు ఉడికించాలి.
ఆపై అందులో ఉప్పు , పసుపు, కారం వేసి కలిపి అందులోనే వేయించి పక్కన పెట్టుకున్న కోడి గుడ్లను వెయ్యాలి. ఆపై అందులో ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసం పోసి, మీడియం మంటపై మూత పెట్టి ఉడికించాలి. గుడ్లు , పుల్ల కంద బాగా ఉడికిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి కలపాలి.
తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కలిపి సన్నని మంటపై (Low flame) 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు చల్లుకుని దించేయాలి. అంతే! ఘుమఘుమలాడే రుచికరమైన పుల్ల కంద ఎగ్ పులుసు సిద్ధం. వేడి వేడి అన్నంలో ఇది తింటే చాలా బాగుంటుంది.













Click it and Unblock the Notifications
