సుప్రీం చెప్పినా డోంట్ కేర్..! నవోదయ స్కూళ్లపై తేల్చేసిన విజయ్ సర్కార్..!
తమిళులు తమ భాష, సంస్కృతి, విధానాల విషయంలో ఎంత పట్టుదలగా ఉంటారో విజయ్ సర్కార్ మరోసారి నిరూపిస్తోంది. రాష్ట్రంలో హిందీ అమలు చేసేందుకు వీలుగా నవోదయ స్కూళ్లను నెలకొల్పేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు విజయ్ సర్కార్ భూములివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. మైండ్ సెట్ మార్చుకోవాలంటూ ప్రభుత్వానికి చురకలు అంటించింది. మూడు నెలల్లో నవోదయ స్కూళ్లకు ప్రభుత్వం భూమి ఇచ్చితీరాలంటూ తేల్చిచెప్పింది.
దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) ద్విభాషా విధానం విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పేసింది. నవోదయ స్కూళ్లకు భూమి కేటాయించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ స్పష్టమైన ప్రకటన చేశారు. ద్విభాషా సూత్రం అమలు విషయంలో తాము ప్రస్తుత విధానానికే కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఎలాంటి మార్పూ లేదన్నారు. నవోదయ స్కూళ్లకు భూమి కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న తన అభిప్రాయం వెల్లడించారని, ఇదేమీ తుది తీర్పు కాదని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ కేసు విచారణ నడుస్తోందని మంత్రి రాజ్ మోహన్ గుర్తుచేశారు. తాము హిందీకి గానీ, ఏ ఇతర భాషకు గానీ వ్యతిరేకం కాదని, తాము ఇప్పటికే మోడల్ స్కూళ్లను విజయవంతంగా నడిపిస్తున్నామని, వీటి ద్వారా ఎంతో మంది విద్యార్ధులు ఉన్నత చదువుల్లో రాణిస్తున్నారని విద్యాశాఖ మంత్రి గుర్తుచేశారు. అంతకు ముందు నిన్న సుప్రీంకోర్టు.. తమ రాష్ట్రంలో హిందీ బోధన జరగకూడదనే ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలంటూ విజయ్ సర్కార్ కు సూచించింది. రాష్ట్రాలు విడిగా దేశాల తరహాలో విధానాలు అమలుచేయలేవని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.















Click it and Unblock the Notifications
