టీమిండియా చీఫ్ సెలెక్టర్ మార్పు? అగార్కర్ స్థానంలో ఆ మాజీ క్రికెటర్!
భారత పురుషుల క్రికెట్ జట్టుకు రాబోయే 12 నెలల కాలం కీలకంగా మారనుంది. ఓ వైపు దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్‌కు బలమైన జట్టును సిద్ధం చేయడం, మరోవైపు 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో నిలవడం లాంటి భారీ లక్ష్యాలు బీసీసీఐ ముందు ఉన్నాయి. ఈ కీలక సమయంలో పురుషుల సెలక్షన్ కమిటీ నాయకత్వంపై బీసీసీఐ తీసుకోబేయే నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించే అంశంపై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో కొత్త ఛైర్మన్‌గా భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ పార్థివ్ పటేల్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై అనుమానాలు మరింత పెరగడానికి ఇటీవల జరిగిన ఓ కీలక సమీక్షా సమావేశమే కారణమని వార్తలు వస్తున్నాయి. భారత క్రికెట్ భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ హాజరైన ఈ సమావేశానికి అజిత్ అగార్కర్ హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన అందుబాటులో లేరని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేసినప్పటికీ.. హెడ్ కోచ్, కెప్టెన్లు ఉన్న కీలక సమావేశానికి చీఫ్ సెలెక్టర్ గైర్హాజరు కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ పార్థివ్ పటేల్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడితే ప్రస్తుత కమిటీ సభ్యుల్లో టెస్ట్ మ్యాచ్ అనుభవం పరంగా ఆయనే అత్యంత సీనియర్ గా నిలుస్తారు. భారత్ తరఫును 25 టెస్టులు, 38 వన్డేలు ఆడిన పార్థివ్ పటేల్.. మిగిలిన సభ్యులైన ప్రజ్ఞాన్ ఓఝా(24 టెస్టులు), శివసుందర్ దాస్(23 టెస్టులు), ఆర్పీ సింగ్(14 టెస్టులు) కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు సహాయ కోచ్ గా వ్యవహరిస్తున్న 41 ఏళ్ల పార్ధివ్ పటేల్ కు ఈ కీలక బాధ్యతలు అప్పగిస్తే.. ఆయన కోచింగ్ కాంట్రాక్టును వదులుకోవాల్సి ఉంటుంది. రాబోయే వారాల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
