ఏం తీశాడ్రా బాబు..!!
'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా' సిరీస్ చివరి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కుంభకోణం, దాని వ్యవస్థాపకుడు రామలింగరాజును కేంద్ర బిందువుగా చేసుకుకుని రూపొందించిన ఎపిసోడ్ ఇది. బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా 'రైడింగ్ ది టైగర్' పేరుతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ లో ఇది నాలుగోది.. చివరిది కూడా. అయిదేళ్ల న్యాయపోరాటం తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఇన్వెస్టిగేటివ్ సిరీస్‌కు తెరపడింది.
2020లో హైదరాబాద్ సివిల్ కోర్టు తాత్కాలిక స్టే ఆర్డర్ కారణంగా దీని విడుదల ఆలస్యమైంది. ఈ డాక్యుమెంటరీలో సగం నిజాలు మాత్రమే ఉన్నాయని, అవి తన పరువుకు నష్టం కలిగిస్తాయని, న్యాయపరమైన అప్పీళ్లను ప్రభావితం చేస్తాయని అప్పట్లో రామలింగరాజు వాదించారు. కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. న్యాయపరమైన చిక్కులన్నింటినీ విడదీసుకుని తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. సత్యం కుంభకోణానికి సంబంధించిన అంశాన్నీ ఇందులో పొందుపర్చినట్లు సిరీస్ మేకర్స్ చెబుతున్నారు.

'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా' మొదటి సీజన్ అక్టోబర్ 2020లో ప్రారంభమైంది. ఇందులో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సుబ్రతా రాయ్ వంటి ప్రముఖులపై చేసిన ఇన్వెస్టిగేటివ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. సత్యం రామలింగరాజు ఉదంతాన్ని కూడా ఈ సిరీస్ లోనే చిత్రీకరించారు. రామలింగరాజు కోర్టుకెక్కడం వల్ల ఈ ఎపిసోడ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.
ఈ చివరి భాగం విడుదలకు సంబంధించిన సమాచారాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా నిర్ధారించింది. "ఐటీ సంస్థ సత్యం కంప్యూటర్ సర్వీసెస్ విజయవంతంగా తన ప్రస్థానం సాగిస్తోన్న సమయంలో రామలింగరాజు లెక్కలు సరిపోలలేదు. అదెలాగో తెలుసుకోవడానికి బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా నాలుగో ఎపిసోడ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి.." అని నెట్ ఫ్లిక్స్ ఇండియా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
ఈ కొత్త ఎపిసోడ్ సత్యం కంప్యూటర్స్‌లో జరిగిన ఆర్థిక మోసాన్ని వెలికితీసింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసపూరిత కేసుల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. 2009లో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం సుమారు 1.5 బిలియన్ల నష్టాలకు దారితీసింది. 15 సంవత్సరాలకు పైగా కార్పొరేట్ ప్రపంచాన్ని కుదిపేసిన సత్యం కుంభకోణం వ్యవహారం.. ఈ డాక్యుమెంటరీతో మళ్ళీ చర్చల్లో నిలిచింది. దేశంలోని అతిపెద్ద వ్యాపార పతనాలలో ఒకటైన ఈ వ్యవహారంపై సుదీర్ఘ న్యాయ, సాంస్కృతిక ప్రతిష్టంభనకు ఈ ఎపిసోడ్ ముగింపు పలికింది.












Click it and Unblock the Notifications