ఫ్యాన్స్‌కి బిగ్ షాక్.. అక్కడికి రావొద్దంటున్న హరిహర వీరమల్లు టీమ్ !
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. ఈ పీరియాడిక్ డ్రామాకు మొదట క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించగా.. పలు అనివార్య కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమా పూర్తిచేశారు. కాగా ఇప్పుడు ఫస్ట్ పార్టీ " స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ " పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం.. ఆయన రాజకీయాల బిజీ షెడ్యూల్, విఎఫ్ఎక్స్ పనుల జాప్యం వల్ల సుమారు 14 సార్లు వాయిదా పడింది. అది కూడా ఓ రికార్డుగా నిలిచింది. జూలై 24న విడుదలకు సిద్ధమైంది ఈ మూవీ.

కాగా రేపు (జూలై 21, సోమవారం) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగబోతోంది. ఈ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్‌తో పాటు రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (TG), కందుల దుర్గేశ్(AP), దిగ్గజ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు హాజరు కాబోతున్నారు.
అయితే ఈ నేపథ్యంలో అభిమానులకు చిత్రబృందం కీలక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.
'అభిమానులు.. అందరికీ నమస్కారం. ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి మీరు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారని మాకు తెలుసు. మీ ప్రేమను మేము అర్థం చేసుకోగలం. దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే వేదిక వద్దకు రావాలని కోరుతున్నాం. పాసులు లేకుండా అక్కడికి వస్తే.. ఎంట్రీ ఉండదు. భారీ సంఖ్యలో గుమిగూడటం వల్ల చాలా ఇబ్బందిగా మారుతుంది. ఫంక్షన్ సజావుగా జరిగేందుకు సహకరించండి' అని విజ్ఞప్తి చేసింది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలక పాత్రలలో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications