కోటా శ్రీనివాసరావుపై దాడి చేయడానికి కారణం ఆ సినిమానే..?
కోట శ్రీనివాసరావు .. విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకునే ఆ దిగ్గజ నటుడు ఇకలేరు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన.. ఈరోజు ( జూలై 14, 2025 ) తెల్లవారుజామున హైదరాబాద్‌లో నివాసంలోనే మృతి చెందారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అలానే సోషల్ మీడియా వేదికగా కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
1978లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినీ రంగంలో అడుగుపెట్టారు కోట శ్రీనివాసరావు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన, అనేక పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 750కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఆయన తుదిశ్వాస విడిచిన తరుణంలో ఆ విషయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

మండలాధీశుడు మూవీ..
కోట సినీ జీవితంలో 'మండలాధీశుడు' సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ మూవీ తోనే ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ - కృష్ణ మధ్య రాజకీయ వైరం నడిచిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయం లోనే కోటతో 'మండలాధీశుడు' అనే సినిమాను నిర్మించారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఉద్దేశించిన రీతిలో ఆ పాత్ర ఉండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దాంతో ఎన్టీఆర్, టీడీపీ అభిమానుల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
అయితే ఆ సినిమా విడుదలైన కొద్దికాలానికే.. ఒక సందర్భంలో విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న సమయంలోనే కోట కూడా అక్కడే ఉన్నారట. ఆ సమయంలో కొందరు తెలుగుదేశం అభిమానులు కోటను గుర్తించి.. ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారట. ఈ విషయాన్ని తానే ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ "ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని అక్కడ్నించి పారిపోవాల్సి వచ్చింది" అని వ్యాఖ్యానించారు.
సినిమా తీసిన వాళ్లు, కథ రాసిన వాళ్లు బాగానే ఉన్నారు. నటుడిగా చేసినందుకు నన్నెందుకు ఇంత ఇబ్బందిపెడుతున్నారని అప్పుడు ఫీల్ అయ్యానని ఎమోషనల్ అయ్యారు. ఆ తరువాత కొంత కాలానికి ఆ విషయం సమసిపోయిందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications