రాజమౌళి - మహేష్‌బాబు సినిమా తొలిరోజు ఎంత వసూలు చేస్తుందంటే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. జనవరి నెలలో మీడియా సమావేశం పెట్టి రాజమౌళి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ, గోపాల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్లుగా ఉంది. భారతదేశంలోని పలు భాషలతోపాటు ఇంగ్లిషులో హాలీవుడ్ లో, విదేశాలకు చెందిన ఇతర భాషల్లో కూడా దీన్ని భారీగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుందా? అనే అంచనాలు ఇప్పటినుంచే ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.
యాక్షన్ అడ్వెంచర్ గా
అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా ఉంటుందంటున్నారు. సినిమా పూర్తి కావడానికి దాదాపు మూడు సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. దాదాపు రూ.2వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందంటున్నారు. తొలిరోజు ఈ సినిమాకు రూ.294 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. తెలుగులోకన్నా హిందీలోనే కలెక్షన్లు ఎక్కువగా వస్తుండటంతో ఒక్క హిందీ వెర్షన్ లోనే ఈ సినిమా రూ.వెయ్యి కోట్లు రాబట్టే అవకాశం కనపడుతోంది. ఒకరకంగా బాలీవుడ్ స్టార్లందరికీ పుష్ప2 భారీ షాక్ ఇచ్చినట్లైంది.

తొలిరోజు రూ.600 కోట్లు?
పుష్ప2 ఇంత కలెక్షన్లు వసూలు చేస్తుండటంతో రాజమౌళి-మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా తొలిరోజు ఎంత వసూలు చేయొచ్చు, మొత్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసే అవకాశం ఉందని ఫిలింనగర్ లో అందరూ లెక్కలు వేసుకుంటున్నారు. తొలిరోజు ఈ సినిమా రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం రూ.600 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. అందుకు కారణం విదేశీ భాషల్లో కూడా సినిమా విడుదలవడమేనంటున్నారు. ఒకవేళ సినిమా బడ్జెట్ ను పెంచుకుంటూ వెళ్లి హాలీవుడ్ కు ధీటుగా సినిమా తీస్తే దాదాపుగా రూ.5వేల కోట్ల నుంచి రూ.6వేల కోట్లు విడుదల చేయొచ్చంటున్నారు. మహేష్ బాబు అభిమానులు కూడా దీనిపై లెక్కలు వేసుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications