స్టార్ హీరోయిన్ ఇంట్లో దారుణం: మీకు చేతులెలా వచ్చాయి?
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి దగ్గరి బంధువు ఆసిఫ్ ఖురేషి దారుణహత్యకు గురయ్యారు. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. హత్య చేశారు. కొన్ని గంటల వ్యవధిలో ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు.
హతుడి పేరు ఆసిఫ్ ఖురేషి. హ్యూమా ఖురేషికి తమ్ముడి వరుస అవుతాడు. ఢిల్లీ నిజాముద్దీన్ సమీపంలోని జంగ్‌పురా భోగల్ లేన్‌లో రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చాలాకాలంగా ఆసిఫ్ ఖురేషీ.. తన కుటుంబంతో కలిసి భోగల్ లేన్ లో నివాసం ఉంటోన్నాడు.

రాత్రి ఆసిఫ్ ఇంటి మెయిన్ గేటు ముందు గుర్తు తెలియని వ్యక్తులు తమ బైక్ ను పార్క్ చేశారు. అదే సమయంలో ఆసిఫ్ ఇంటికి వచ్చాడు. కారు లోనికి వెళ్లడానికి దారి లేకపోవడంతో వారితో గొడవ పడ్డాడు. తొలుత- గేట్ ముందు ఉంచిన వాహనాలను తొలగించాలని కోరాడు. దీనికి వాళ్లు అంగీకరించకపోవడంతో మాటామాటా పెరిగింది.
ఇది ఘర్షణకు దారితీసింది. నిందితులు పదునైన ఆయుధాలతో ఆసిఫ్‌పై దాడి చేశారు. ఈ గొడవలో ఆసిఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న ఆయనను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఈ విషయంపై ఆసిఫ్ భార్య సైనాజ్ ఖురేషి, ఆయన బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. జంగ్ పురాలో వారిని అరెస్ట్ చేశారు.
పార్కింగ్ విషయంలో గొడవ చెలరేగిందని, మాటామాటా పెరిగి.. నిందితులు ఆసిఫ్‌పై దాడి చేశారని సైనాజ్ ఖురేషి కన్నీరు మున్నీరు అయ్యారు. గతంలో కూడా ఇదే పార్కింగ్ సమస్యపై నిందితులు ఆసిఫ్‌తో గొడవ పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని లిఖితపూరకంగా పోలీసులకు తెలియజేశారు.
గురువారం ఆసిఫ్ పని నుంచి తిరిగి రాగానే, ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇరుగుపొరుగు వారి ద్విచక్ర వాహనం పార్క్ చేసి ఉండటం చూశారు. వెంటనే వారిని వాహనాన్ని తీయమని కోరగా, నిందితులు వాహనాన్ని తీయకుండా ఆసిఫ్‌ను దూషించి, పదునైన ఆయుధాలతో దాడి చేశారని సైనాజ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications