టాలీవుడ్‌లో 'కమిట్‌మెంట్' అసలు రంగు బయటపెట్టిన హీరోయిన్!
'మా ఊరి పొలిమేర' సినిమాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి కామాక్షి భాస్కర్ల. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉన్న 'కాస్టింగ్ కౌచ్', కమిట్మెంట్ సంస్కృతిపై చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు నిజంగానే ఉన్నాయా అనే ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
చిత్రసీమలో కమిట్మెంట్ అడిగే సంస్కృతి ఉందనేది వాస్తవమేనని.. అయితే అది ఎవరికి ఏ స్థాయిలో ఎదురవుతుందనేది వారి అనుభవాలను బట్టే చెప్పగలమని కామాక్షి భాస్కర్ల స్పష్టం చేశారు. "ఇండస్ట్రీలో డబ్బు ఉన్నవారు ప్రొడ్యూసర్లుగా అడుగుపెడతారు. అలాగే నటన, దర్శకత్వంపై ఆసక్తి ఉన్న ఎంతో మంది యంగ్ టాలెంట్స్ అవకాశాల కోసం వారి చుట్టూ తిరుగుతుంటారు. అలా వచ్చినవారిని తమ మాటలతో కొందరు మాయ చేస్తుంటారు. ఈ తరహా మోసాలు కేవలం అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకే కాకుండా.. డైరెక్టర్లు కావాలని కలలు కనే అబ్బాయిలకు కూడా జరుగుతున్నాయి" అని కామాక్షి భాస్కర్ల సంచలన నిజాలు బయటపెట్టారు.

ఈ సందర్భంగా అసలైన నిర్మాతలకు, డబ్బు ఉండి నిర్మాతగా చలామణి అయ్యేవారికి మధ్య ఉన్న తేడాను ఆమె వివరించారు. కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన నిర్మాత అయిపోరని.. సినిమా నిర్మించడం అనేది ఓ గొప్ప క్రాఫ్ట్ అని ఆమె పేర్కొన్నారు. డి.రామానాయుడు, అల్లు అరవింద్, సురేష్ బాబు, స్వప్న దత్ వంటి వారే నిజమైన నిర్మాతలని కొనియాడారు. కేవలం డబ్బుతో వచ్చి నిర్మాతలు అని చెప్పుకునే కొంత మంది వ్యక్తులు హీరోయిన్లు కావాలనుకునే వారిని కమిట్మెంట్ పేరుతో ఇబ్బంది పెడుతుంటారని వెల్లడించారు.
ఆఫర్లు ఇచ్చే నెపంతో నేరుగా కాకుండా 'ఇంకేంటి? మరేంటి?' అంటూ వేరే అర్థాలు వచ్చేలా సంభాషిస్తారని కామాక్షి భాస్కర్ల కామెంట్ చేశారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ పదాల వెనుక ఉన్న అసలు కోణం తనకు అర్థం కాలేదని.. ఎవరైనా కమిట్మెంట్ గురించి అడిగితే తాను పని పట్ల చాలా కమిటెడ్‌గా ఉంటానని సమాధానం చెప్పేదాన్నని గుర్తుచేసుకున్నారు. ఆ పదానికి వేరే అర్థం ఉందని గ్రహించడానికి తనకు దాదాపు మూడేళ్ల సమయం పట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వృత్తిరీత్యా క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల.. మోడలింగ్ రంగానికి వచ్చి మిస్ తెలంగాణ టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత నటనపై ఉన్న మక్కువతో 'మా ఊరి పొలిమేర' ద్వారా ఓవర్ నైట్ స్టార్ గా మారారు. ఈ చిత్రం సీక్వెల్ 'మా ఊరి పొలిమేర 2' బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూలు చేసి ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్‌తో పాటు 'ఝాన్సీ', 'మిక్స్ అప్', 'ఓం భీమ్ బుష్' వంటి వైవిధ్యమైన ప్రాజెక్టులతో వరుస అవకాశాలు అందుకొని బిజీగా మారారు. స్వయంకృషితో నిలదొక్కుకున్న కామాక్షి భాస్కర్ల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.














Click it and Unblock the Notifications