త్రిష-విజయ్ రూమర్ల వేళ షాక్: 'కరుప్పు' సినిమా షోలు వరుసగా రద్దు!
తమిళ సినీ రంగంలో మోస్ట్ అవేటెడ్ సినిమాగా వచ్చిన సూర్య, త్రిషల 'కరుప్పు' విడుదలలో అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం 9 గంటల షోలు రద్దు కావడంతో మొదలైన ఈ గందరగోళం, మధ్యాహ్నం, మ్యాట్నీ షోల వరకు పాకింది. ముఖ్యమంత్రి విజయ్ ఈ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చినప్పటికీ.. చెన్నైలోని ప్రధాన థియేటర్లలో షోలు రద్దు కావడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
చెన్నైలోని వెట్రి, కమలా సినిమాస్, జీకే సినిమాస్ వంటి ప్రముఖ థియేటర్ల యాజమాన్యాలు మధ్యాహ్నం షోలను కూడా రద్దు చేస్తున్నట్లు తమ అధికారిక సామాజిక మాధ్యమాల్లో ప్రకటించాయి. నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు మధ్య ఉన్న ఆర్థికపరమైన లావాదేవీలు ఇంకా తేలకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి 4-5 రోజుల్లో రీఫండ్ చేస్తామని థియేటర్ల యజమానులు వెల్లడించారు.

ముఖ్యమంత్రి విజయ్, త్రిషల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ సినిమాకు ఉదయం 9 గంటల షోలకు ప్రత్యేక అనుమతి లభించిందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.. ఆర్థిక చిక్కుల వల్ల షోలు నిలిచిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం రూ. 7.2 కోట్లకు పైగా వసూలు చేసింది.
దర్శకుడు ఆర్.జె. బాలాజీ ఈ పరిస్థితులపై స్పందిస్తూ.. సినిమా విడుదల కోసం దేవుడిపైనే భారం వేశానని, నిర్మాతలు సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. 32 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి రావాల్సి ఉండగా, సాయంత్రం షోల నుంచైనా సినిమా ప్రదర్శితమవుతుందేమోనని ఎగ్జిబిటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. సూర్య-త్రిషలు 21 ఏళ్ల తర్వాత జంటగా నటించిన ఈ చిత్రం కోర్టు డ్రామా నేపథ్యంలో సాగనుంది.
ఈ షోల రద్దు విషయాన్ని చిత్ర నిర్మాత ఎస్ఆర్ ప్రభు సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. అనివార్య కారణాల వల్ల ఉదయం 9 గంటల షోలను రద్దు చేయాల్సి వస్తోందని, ఇందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నానని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే ఈ రద్దుకు గల స్పష్టమైన కారణాలను ఆయన వెల్లడించలేదు. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆర్థిక పరమైన లావాదేవీల చిక్కుల వల్లే షోలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. గతంలోనూ 'లియో' వంటి సినిమాలకు ఇలాంటి ఇబ్బందులే ఎదురైన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
తమిళనాడులో ఉదయం వేళ స్పెషల్ షోలపై కఠిన నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. 2023లో జరిగిన ఓ ప్రమాదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 4 గంటల షోలపై నిషేధం విధించింది. 9 గంటల తర్వాతే షోలు ప్రారంభం కావాలి. ఈ నేపథ్యంలో 'కరుప్పు' టీమ్ అభ్యర్థన మేరకు సీఎం విజయ్ ప్రత్యేకంగా 9 గంటల షోలకు అనుమతి ఇచ్చారు. దీనికి మేకర్స్ రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. కానీ రిలీజ్ రోజు ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. 'కరుప్పు' చిత్రంలో సూర్య అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే లాయర్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. త్రిష కూడా లాయర్ పాత్రలో కనిపించనున్నారు.












Click it and Unblock the Notifications