ఘోర విమాన ప్రమాదం: రన్‌వేపై పేలిపోయిన ప్రైవేట్ జెట్! (వీడియో)
డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లా రొమానా ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఓ ప్రైవేట్ జెట్ విమానం రన్‌వేపై ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ల్యాండింగ్ సమయంలో భారీ విస్పోటనం
ప్రమాదానికి గురైన విమానం గల్ఫ్‌స్ట్రీమ్ జీ200 రకానికి చెందిన ప్రైవేట్ జెట్‌గా అధికారులు గుర్తించారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు లా రొమానా ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. అయితే రన్‌వేను తాకిన మరుక్షణమే విమానంలో భారీ పేలుడు సంభవించి చూస్తుండగానే అగ్నిగోళంలా మారిపోయింది. ఆ విమానం పడిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

తృటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక, రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే విమాన సిబ్బంది ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. డొమినికన్ సివిల్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. లా రొమానాకు నైరుతి దిశలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే విమానంలో ఎమర్జెన్సీ ఉన్నట్లు పైలట్లు ప్రకటించారు. ఆ తర్వాత విమానాశ్రయానికి తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో విమానంలో ఎలాంటి ప్రయాణికులు లేకపోవడంతో మరికొంత ప్రాణనష్టం తప్పింది.
WATCH: Private jet crashes while emergency landing at La Romana International Airport in Dominican Republic. pic.twitter.com/oiaEIRPjes
— AZ Intel (@AZ_Intel_) June 7, 2026
ప్రమాద కారణాలపై దర్యాప్తు
ప్రస్తుతానికి విమానంలో ఎలాంటి టెక్నికల్ లోపం తలెత్తిందనే విషయంపై స్పష్టత రాలేదు. విమానయాన భద్రతా సంస్థలు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించాయి. విమాన సాంకేతిక రికార్డులను, ఫ్లైట్ డేటాను విశ్లేషించి ప్రమాదానికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విమానం ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి వెళ్తోందనే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications