విరాట్ కోహ్లీ బయోపిక్.. హీరోగా ఆ స్టార్ నటుడు..?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. అటు ఇంటర్నేషనల్, ఇటు ఐపీఎల్ లో రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గా ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో ఎన్నో అరుదైన రికార్డులను నెలకొల్పాడు. అయితే తాజాగా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ బయోపిక్ వస్తోందంటూ నెట్టింట వార్త హల్ చల్ చేస్తోంది.
విరాట్ కోహ్లీ బయోపిక్ లో కోలీవుడ్ కు చెందిన ఓ స్టార్ నటుడు కోహ్లీ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు కారణం.. తాజాగా ఓ చాట్ షోలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలేనని తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగానే కోహ్లీ బయోపిక్ వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ ఇటీవల ఓ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటించిన 'పత్తు తల' చిత్రంలోని 'నీ సింగం దాన్' అనే సాంగ్ తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. ఈ సాంగ్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. తాజాగా ఈ పాట తనకు ఇష్టమని కోహ్లీ చెప్పడంతో మరోసారి ఈ పాట వైరల్ గా మారింది.

అయితే నీ సింగం దాన్ పాట ఇష్టమంటూ కోహ్లీ చెప్పిన వీడియోను ఆర్సీబీ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనికి శింబు స్పందించడం విశేషం. "నీ సింగం దాన్" అంటే "నువ్వు నిజమైన సింహం" అని వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కోహ్లీ బయోపిక్ లో హీరో శింబు నటిస్తున్నాడనే వార్తలు సైతం ఊపందుకున్నాయి. ఇద్దరూ ఒకేలా గడ్డం పెంచడంతో ఈ వార్తలు నిజమేనని సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎవరూ అధికారికంగా ప్రకటన చేయలేదు.
ఇక కోలీవుడ్ నటుడు శింబు ప్రస్తుతం.. కమల్ హాసన్ తో కలిసి థగ్ లైఫ్ సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాక ఎస్టీఆర్49, ఎస్టీఆర్50 సినిమాలు సైన్ చేశాడు.












Click it and Unblock the Notifications