పృథ్వీని తప్పుపడుతున్న టాలీవుడ్?
Prithvi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమేడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గట్లేదు. దీనిపై ఆ పార్టీ సోషల్ మీడియాలో ఇప్పటికీ పోస్టులు భారీగా పడుతూనే ఉన్నాయి. తొలుత విశ్వక్‌సేన్, ఆ తరువాత పృథ్వీ.. క్షమాపణలు చెప్పినప్పటికీ- వివాదం చల్లారట్లేదు.
తాజాగా పృథ్వీ వ్యాఖ్యలను తోటి నటుడు బ్రహ్మాజీ సైతం తప్పు పట్టారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో పృథ్వీదే తప్పని తేల్చి చెప్పారు. ఓ సినిమా ఫంక్షన్‌లో పృథ్వీ అలా రాజకీయాల గురించి మాట్లాడకూడదని అన్నారు.

పృథ్వీ మీద సోషల్ మీడియాలో రియాక్ట్ కావడం కరెక్టేనని వ్యాఖ్యానించారు బ్రహ్మాజీ. ఏపీలో ఎన్నికలు ఎప్పుడో ముగిసిపోయాయని, ఇప్పుడక్క పరిపాలన సాగుతోందని, ఇలాంటప్పుడు కొత్తగా ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడం తప్పేనని చెప్పారు. ఎన్నికల సమయంలో ఆయన ఒక పార్టీ స్టాండ్ తీసుకుని జోకులు వేసుకున్నా ఎవరూ పట్టించుకోరని పేర్కొన్నారు.
విష్వక్‌సేన్ మంచి హీరో అని, అందరితోనూ కలివిడిగా ఉంటాడని, ప్రతి చిన్న ఫంక్షన్‌కూ వెళ్తుంటాడని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు. ఆయనకు ఎలాంటి ఈగో లేదని కితాబిచ్చారు. చిన్న సినిమాకు ఆయన చాలా సపోర్ట్ చేస్తుంటాడని, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఫంక్షన్లకు కూడా వచ్చి అండగా ఉంటాడని అన్నారు.
అలాంటి హీరో సినిమా ఫంక్షన్‌కు వచ్చి స్టేజీ మీద రాజకీయంగా ఒక పార్టీని ఉద్దేశించి సెటైర్లు వేయడం సరికాదని బ్రహ్మాజీ చెప్పారు. ముమ్మాటికీ పృథ్వీదే తప్పని అన్నారు. ఈ విషయంలో పృథ్వీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్లందరూ కరెక్టే చేస్తోన్నారని వ్యాఖ్యానించారాయన.












Click it and Unblock the Notifications