నేను సుస్మితా సేన్ సంపాదనపై ఆధారపడ్డ ప్రియుడిని: లలిత్ మోదీ
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో తనకున్న బంధంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోదీ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో వీరిద్దరి రిలేషన్ షిప్ వార్తలు సోషల్ మీడియాలో ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో సుస్మితా సేన్ కేవలం లలిత్ మోదీ డబ్బు కోసమే అతనితో తిరుగుతోందంటూ నెటిజన్లో ఆమెను 'గోల్డ్ డిగ్గర్' (డబ్బు పిచ్చిది) అని దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' టాక్ షోలో పాల్గొన్న లలిత్ మోదీ.. ఆనాటి విమర్శలను పూర్తిగా తిప్పికొడుతూ సుస్మితా సేన్‌కు మద్దతుగా నిలిచారు.
సుస్మితా సేన్‌పై వచ్చిన ఆరోపణలను లలిత్ మోదీ ఖండించారు. సుస్మితా సేన్ ఎంతో అందమైన, విజయవంతమైన, ఆర్థికంగా స్వయం సమృద్ధి గల మహిళ అని కొనియాడారు. "నాకు తెలిసిన వాళ్లందరిలో కంటే సుస్మితా సేన్ దగ్గరే ఎక్కువ డైమండ్స్ ఉన్నాయి. వాటిని ఆమె తన సొంత సంపాదనతోనే కొనుగోలు చేసింది. గతంలో ఆమెకు సొంతంగా డైమండ్ స్టోర్స్ కూడా ఉండేవి. మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్లినా.. అక్కడ బిల్లులు నేనెప్పుడూ కట్టలేదు, ప్రతి దానికి ఆమెనే డబ్బులు చెల్లించేది. నిజం చెప్పాలంటే, నేను ఒక రకంగా ఆమె సంపాదనపై ఆధారపడిన ప్రియుడిని" అంటూ లలిత్ మోదీ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

డబ్బు కోసం సుస్మితాసేన్ ఎవరిపైనా ఆధారపడే వ్యక్తి కాదని.. ఆమెను డబ్బు పిచ్చిది అనడం పూర్తిగా తప్పని లలిత్ మోదీ స్పష్టం చేశారు. సుస్మితా సేన్ ఓ స్వచ్ఛమైన వజ్రం లాంటిదని ప్రశంసించారు. తమ మధ్య దూరం పెరగడం వల్ల విడిపోవాల్సి వచ్చిందని.. అయినప్పటికీ సుస్మితా సేన్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. ఇద్దరు ఆడపిల్లలను ఒంటరి తల్లిగా పెంచి పెద్ద చేసిన సుస్మితా సేన్ అంటే తనకు ఇప్పటికీ ఎంతో గౌరవం ఉందని.. ఆమె ఎప్పటికీ తనకు మంచి స్నేహితురాలిగా ఉంటుందని లలిత్ మోదీ పేర్కొన్నారు.
అలాగే 2022లో వీరిద్దరి రిలేషన్‌షిప్‌ను ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన వైరల్ పోస్ట్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కూడా లలిత్ మోదీ బయటపెట్టారు. ఆ పోస్ట్ చేయడం వెనుక ఎటువంటి ముందస్తు ప్లాన్ లేదని.. అంతా అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిపోయిందని చెప్పారు. ఒకసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు తమ మధ్య ఏదో చిన్న విషయంలో వాదన జరిగిందని.. ఆ సమయంలో సుస్మితా సవాల్ విసురుతూ 'నువ్వు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేవు' అని అందట. దాంతో తాను నవ్వుతూ వెంటనే పోస్ట్ బటన్ నొక్కేశానని.. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ పోస్ట్ విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, తమది ఓ అందమైన కథ అని లలిత్ మోదీ ముగించారు.












Click it and Unblock the Notifications