పందెం కాస్తా... 'గుంటూరు కారం' ఆడదని!
ఏ ముహూర్తాన ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందో తెలియదుకానీ ఆరోజు నుంచి ఇప్పటివరకు అన్నీ అడ్డంకులే. సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు, ఖలేజా తర్వాత ముచ్చటగా మూడోసినిమాగా ప్రారంభమైంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ జతకట్టారు. దీంతో షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఈ చిత్రం మీద భారీ హైప్ నెలకొంది.
ఆ తర్వాత నుంచి ఈ సినిమా అసలు కథ జరుగుతూ వస్తోంది. ముందుగా దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఒన సినిమా కథలో జోక్యం చేసుకోవడం, దానికి సంబంధించిన సూచనలను ఇవ్వడంవల్ల కాస్తంత ఆలస్యమైంది. మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చారంటూ రూమర్లు వచ్చాయి. వాటిని తమన్ తిప్పికొట్టాడుకానీ చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీని మార్చారు. తర్వాత హీరోయిన్ పూజాహెగ్దే బదులుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలయ్యారు. ఈ సినిమా షూటింగ్ కు ఎప్పుడు విరామం వచ్చినా వెంటనే అది వారంరోజులు కానీ, పదిరోజులుకానీ, రెండువారాలు కానీ.. కుటుంబంతో సహా మహేష్ బాబు విదేశాలకు చెక్కేసేవాడు. అప్పటివరకు ఈ సినిమాపై ఉన్న భారీ హైప్ క్రమంగా తగ్గుతూ వచ్చింది.

సినీ ప్రేక్షకులతోపాటు మహేష్ బాబు అభిమానులు కూడా ఈ సినిమా మీద ఆశలు పెట్టుకోలేదు. సినిమా ఆడుతుందనే నమ్మకం లేదంటూ ఒకర్నొకరు అభిమానులు ఓదార్చుకునేవారు. సోషల్ మీడియాలో వీటిపైనే కామెంట్లు వెల్లువలా వచ్చేవి. కొంతమంది మహేష్ బాబు అభిమానులైతే గుంటూరు కారం సినిమా ఆడదని, అవసరమైన పందెం కాస్తాననే స్టేజ్ కు వెళ్లిపోయారు. ఈ సినిమాపై అంత అప నమ్మకం ఎందుకు కలిగింది? ఏయే పరిణామాలు అభిమానులను బాధించాయో తెలుసుకొని సరిచేయాల్సిన నిర్మాత, దర్శకుడు, హీరో ఎవరూ నోరు మెదపలేదు. సంక్రాంతికి ఈ సినిమాను తీసుకొస్తామని మాత్రం చెబుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'కుర్చీ మడతపెట్టి' ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. దీనికి సినీ ప్రేమికుల నుంచి, మహేష్ బాబు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.












Click it and Unblock the Notifications