చిరంజీవి సినిమాకు బిగ్ షాక్..ఆ రూ.45 కోట్లు రికవరీ చేయండి..!
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే, తాజాగా ఆయన నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన న్యాయపోరాటం మొదలైంది. వెండితెరపై కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా, ఇప్పుడు కోర్టు గడప తొక్కిన వైనం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.
సినిమా విడుదలైన తొలినాళ్లలో (జనవరి 11 నుంచి 18 వరకు) సింగిల్ స్క్రీన్లలో రూ. 50/-, మల్టీప్లెక్స్‌లలో రూ. 100/- అదనంగా వసూలు చేయడంపై వివాదం చెలరేగింది. ఈ పెంపు నిబంధనలకు విరుద్ధమని భావించిన డాక్టర్ పాదూరి శ్రీనివాస రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పెంచిన ధరల ద్వారా సమకూరిన అదనపు ఆదాయం దాదాపు రూ. 42 కోట్ల నుంచి రూ. 45 కోట్ల వరకు ఉంటుందని, ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు విషయాన్ని సీరియస్‌గా పరిగణించింది. సదరు తేదీల్లో విక్రయించిన టిక్కెట్ల వాస్తవ గణాంకాలను, వసూలైన మొత్తాన్ని కోర్టుకు సమర్పించాలని జీఎస్టీ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ఈ సొమ్మును వెంటనే ప్రభుత్వ సంచిత నిధికి లేదా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేసేలా చూడాలని కోర్టుకు విన్నవించారు.
కేవలం ఈ సినిమా మాత్రమే కాదు, ఇటీవల విడుదలైన మరికొన్ని భారీ చిత్రాల టిక్కెట్ ధరల వ్యవహారం కూడా ఇప్పుడు కోర్టు దృష్టికి వచ్చింది.పుష్ప-2,గేమ్ ఛేంజర్,అఖండ-2,రాజా సాబ్,చిత్రాలకు సంబంధించిన పాత పిటిషన్లతో కలిపి ఈ కేసును కూడా తదుపరి విచారణలో విచారించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ, తదుపరి నిర్ణయాన్ని వాయిదా వేసింది.
సామాన్య ప్రేక్షకుడి జేబుపై పడే భారాన్ని ప్రశ్నిస్తూ సాగుతున్న ఈ పోరాటం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. చట్టబద్ధంగా టిక్కెట్ ధరలు ఉండాలా లేదా క్రేజ్‌ను బట్టి పెంచుకోవచ్చా అనే అంశంపై ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది












Click it and Unblock the Notifications