మళ్లీ మొదలైన 'మంచు' వార్.. 150 మంది ఇంట్లోకి చొరబడ్డారని కంప్లైంట్
మంచు ఫ్యామిలీలో మంటలు ఇంకా చల్లారినట్టు కనిపించట్లేదు. ఆ మధ్య గొడవలు, కేసులతో మంచు వారి కుటుంబంలో కలహాలు పీక్స్ కి చేరగా.. పోలీసులు కౌన్సిలింగులతో కాస్త సబ్రేక్ పడినట్టు భావించారు. ఆ తర్వాత కేసుల వ్యవహారం కాస్త రూట్ మారి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ఇన్ డైరెక్ట్ గా విమర్శలు గుప్పించుకున్నారు. ఆ తర్వాత ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండడంతో అంతా సర్దుమనిగింది అని భావించారు. అయితే మంచు మనోజ్ - మంచు విష్ణు మధ్య వివాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నట్టుగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.
మంచు మనోజ్ మరోసారి హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా 150 మంది తన ఇంట్లో చొరబడ్డారని.. తన కార్లతో పాటు వ్యక్తిగత వస్తువులు కూడా ఎత్తుకుపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందుకు కారణం తన సోదరుడు మంచు విష్ణు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన కూతురు బర్త్ డే వేడుకల కోసం రాజస్థాన్‌కు వెళ్లగా.. విష్ణు ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేశారని మంచు మనోజ్ పోలీసుల ముందు వాపోయారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడంలేదన్నారు.

తాను ఇంట్లో లేనప్పుడు కారుతోపాటు కాస్ట్‌లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. జల్‌పల్లిలోని ఇంటిలోకి 150మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లోని కార్లన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయని వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు. విష్ణుపై చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. దీంతో మంచు ఫ్యామిలీ వార్ మళ్లీ మొదలైందని జోరుగా చర్చ నడుస్తోంది.
ఇక గతేడాది నుంచి మంచు మోహన్‌బాబు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఆస్తుల వివాదం పీక్ స్టేజ్‌కు చేరడంతో మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మోహన్ బాబు సైతం మంచు మనోజ్ పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలకు వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో మనోజ్ ఆరోపణలపై విష్ణు ఎలా స్పందిస్తారో అని హాట్ డిస్కషన్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications