బాలయ్య వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన మెగాస్టార్ !!
నందమూరి బాలకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన సందర్భంలో.. కరోనా సమయంలో సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్‌ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావించారు. బాలకృష్ణ మాటల్లో చిరంజీవిని అవమానించే రీతిలో వ్యాఖ్యానించారని వివాదం రేగుతోంది. దీనిపై ఇప్పటికే చిరంజీవి సైతం రియాక్ట్ అయ్యారు. కాగా ఇన్ని రోజులు విదేశాల్లో ఉన్న ఆయన ఈరోజు హైదరాబాద్ తిరిగివచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి బాలయ్య వ్యాఖ్యలపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.
చెప్పాల్సినవి చెప్పేశాను..
వెకేషన్ ముగించుకుని ఇండియాకు వచ్చిన చిరంజీవి, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో విలేకరులను కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, చిరు ప్రశ్నలను దాటవేశారు. "నేను చెప్పాల్సిన విషయాలు ఇప్పటికే పత్రిక ప్రకటనలో చెప్పేశాను. ఇకపై ఈ విషయంపై మాట్లాడాల్సింది ఏం లేదు" అని సమాధానమిచ్చారు. అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ ఎయిర్‌పోర్టులో చిరు సందడి చేశారు.

జగన్ ఆహ్వానంతోనే వెళ్లాను - చిరంజీవి లేఖ
అంతకు ముందు బాలయ్య వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన చిరంజీవి.. ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అందులో.. అసెంబ్లీలో బాలకృష్ణ ఒకింత వ్యంగ్యం మాట్లాడటం టీవీలో చూశాను. నా పేరు ప్రస్తావన వచ్చినందువల్ల వివరణ ఇస్తున్నాను. నన్ను లంచ్‌కి రావాలని జగన్ స్వయంగా ఆహ్వానించారు. ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాను. మాకు కలిసే సమయం ఇస్తే ఇండస్ట్రీ ప్రతినిధులందరితో వస్తామని చెప్పాను. కరోనా కారణంగా ఐదుగురితో మాత్రమే రమ్మని సూచించినా, మేము పదిమంది వస్తామని చెప్పగా ఆయన సరే అన్నారు. ఆయన డేట్ ఫిక్స్ చేసి రావాలని చెప్పారు."
బాలకృష్ణని సంప్రదించడానికి ప్రయత్నించా..
చిరంజీవి తన ప్రకటనలో మరో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. "అప్పుడు నేను బాలకృష్ణని కూడా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఫోన్‌లో అందుబాటులో లేకపోవడంతో, జెమిని కిరణ్ ని వెళ్లి ఆయనను కలవమని చెప్పాను. ఆయన మూడు సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. చివరికి నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్. నారాయణ మూర్తితో సహా మరి కొంతమంది ప్రముఖులతో కలిసి సీఎం జగన్‌ను కలిశాము" అని చెప్పారు.
అంతే కాకుండా సినీ పరిశ్రమ సమస్యలపై ఆ సమావేశంలో ముఖ్యంగా టికెట్ ధరల పెంపు గురించి చర్చించామన్నారు చిరంజీవి. "ప్రభుత్వ నిర్ణయం వల్లే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలకు టికెట్ రేట్లు పెరిగాయి. జగన్ మాతో గౌరవంగా మాట్లాడారు. అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరితో ఆయన మర్యాదగా వ్యవహరించారు. ఎవరినీ ఆయన అవమానించలేదు. నేను సాక్షిగా చెబుతున్నాను" అని చిరు లేఖలో స్పష్టం చేశారు.
ఇండస్ట్రీలో హాట్ టాపిక్..
ప్రస్తుతం బాలకృష్ణ - చిరంజీవి మధ్య ఈ మాటల యుద్ధం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమాన వర్గాల్లోనూ ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇకపై బాలయ్య ఈ వ్యాఖ్యలపై మళ్లీ స్పందిస్తారా? లేక వివాదం ఇక్కడితో ఆగిపోతుందా? పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తి రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications