ఆనంద్ మహీంద్రా దంపతుల దాతృత్వం.. హైదరాబాద్ లోని మహీంద్రా వర్సిటీకి రూ. 500 కోట్ల విరాళం
ఆనంద్ మహీంద్రా దంపతులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాదులోని మహీంద్రా యూనివర్శిటీకి భారీ విరాళం అందజేశారు. మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఈ మేరకు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆయన భార్య అనురాధ విరాళాలు ఇచ్చారు. ఈ విషయాన్ని మహీంద్రా వర్సిటీ వెల్లడించింది. ఆయన కుటుంబం యూనివర్సిటీకి మొత్తం రూ. 500 కోట్ల వరకు సాయం చేసినట్లు విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.
యూనివర్సిటీలోని మౌలిక వసతులు, శాలరీలు, పరిశోధన గ్రాంట్లు, అకాడమిక్ కార్యకలాపాలు, విద్యార్థులకు సాయం తదితర వాటికి విరాళాలు ఉపయోగపడతాయని ఆనంద్ మహీంద్రా దంపతులు పేర్కొన్నారు. 2024 లో నిర్ణయం తీసుకున్న ప్రకారం మహీంద్రా వర్సిటీకి మొత్తం రూ. 500 కోట్లు విరాళాలను ఆనంద్ మహీంద్రా దంపతులు అందజేశారు.
ఈ మేరకు రూ. 300 కోట్లు విలువైన 6,50,270 ఈక్విటీ షేర్లను విరాళంగా అందజేశారు. ఈ షేర్లు సంస్థ మొత్తం ఓటింగ్ వాటా మూలధనంలో 0.05 శాతానికి సమానం. అలాగే మహీంద్రా ఎడ్యూకేషనల్ ఇన్వెస్ట్ మెంట్స్ అదనంగా 2,16, 757 ఎం&ఎం షేర్లను పొందింది. ఇవి సంస్థ ఓటింగ్ వాటా మూలధనంలో 0.02 శాతానికి సమానంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ విరాళాల్లో 8,67,027 ఎం&ఎం ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీ మొత్తం ఓటింగ్ షేర్ క్యాపిటల్ లో 0.07 శాతంగా ఉంది.

ఈ భారీ విరాళంపై ఆనంద్ మహీంద్రా దంపతులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. "విద్యకు మా కుటుంబంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. సమాజానికి మనం ఏం తిరిగి ఇచ్చాము.. భావి తరాల కోసం ఎలాంటి అవకాశాలను ఏర్పాటు చేశామన్న దానిపైనే నిజమైన వారసత్వం కొనసాగుతుంది. ఆ నమ్మకంతోనే 2024లో మహీంద్రా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాం. ఈ విశ్వవిద్యాలయం భారత్ తోపాటు ఇతర దేశాల నుంచి విద్యార్థులను ఒకచోట చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. భవిష్యత్తు తరాలకు పునాదిగా ఈ సంస్థ నిర్మాణం జరుగుతోంది" అని ఆనంద్ మహీంద్రా దంపతులు తెలిపారు.












Click it and Unblock the Notifications