బిగ్ బ్రేకింగ్: త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 'ఖైదీ' సినిమాకి ప్రత్యేకత ఉంటుంది. 1983లో విడుదలైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సాధారణ నటుడిగా ఉన్న చిరంజీవిని ఆ చిత్రం స్టార్ ను చేసింది. ఇటువంటి సంచలన చిత్రానికి 40 సంవత్సరాల తర్వాత సీక్వెల్ తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్టు కోసం చేతులు కలుపుతున్నట్లు సమాచారం.
త్రివిక్రమ్ డైరెక్షన్ లో చిరంజీవి నటించాలని కోరుకునేవారు ఎందరో ఉన్నారు. చిరు కామెడీ టైమింగ్ ఒక రేంజ్ లో ఉంటుందనే విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ పంచ్ డైలాగులతో బాగా నవ్విస్తారు. వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే మహా క్రేజ్ గా ఉంటుంది. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. జైచిరంజీవీ చిత్రానికి పనిచేసినప్పటికీ త్రివిక్రమ్ కేవలం రచయితగానే వ్యవహరించారు. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో చిరంజీవి చేసిన కామెడీకి ఇప్పటికీ ఎంతోమంది అభిమానులున్నారు. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ కావాలని కోరుకుంటున్నారు.

"పగ తీర్చుకోవడం కోసమే ఈ జన్మ ఎత్తాను.. ప్రేమ కోసం మరో జన్మ ఎత్తుతాను.. అప్పుడు కలుసుకుందాం" అనే డైలాగ్ తో ఖైదీ సినిమా ముగుస్తుంది. అదే లైన్ ను స్టోరీగా తీసుకొని సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం చేస్తున్న త్రివిక్రమ్ దీనితర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే బన్నీ ప్రాజెక్టు కంటే ముందుగానే ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి బింబిసార్ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications