అందాల ప్రపంచంలో షాకింగ్ ట్విస్ట్.. 15 దేశాలు ఔట్, 6 దేశాలపై నిషేధం.. భారత్ సంగతేంటి?
ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 75వ 'మిస్ యూనివర్స్ 2026' పోటీలు ప్రారంభమయ్యాయి. ప్యూర్టో రికో వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలు ఈ సారి గ్లామర్ కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. గ్రాండ్ ఫినాలేకు ముందే ఏకంగా 15 దేళాల సుందరీమణులు ఈ పోటీ నుంచి తప్పుకోవడం అందాల ప్రపంచంలో పెను కలకలం రేపింది. వీసా సమస్యలు, వ్యక్తిగత కారణాలతో పాటు ఆరు ఆసియా దేశాలపై ఫ్రాంచైజీ వివాదాల వల్ల నిషేధం పడటం చర్చనీయాంశంగా మారింది.
మానసిక ఆరోగ్యమే ముఖ్యమంటూ తప్పుకున్న మిస్ ఆస్ట్రియా
మిస్ యూనివర్స్ ఆస్ట్రియా విక్టోరియా ఎమర్సన్ ఈ పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. తన ఆలోచనలు, విలువలతో రాజీ పడటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తనకు కిరీటం కంటే మానసిక, శారీరక ఆరోగ్యమే ముఖ్యమని, తన ఆత్మవిశ్వాసమే తన అసలైన బలమైన ఆమె పోస్ట్ చేశారు.

కారు ప్రమాదంతో బల్గేరియా.. వ్యక్తిగత కారణాలతో సెయింట్ మార్టిన్
మిస్ యూనివర్స్ బల్గేరియా అనా మారియా ఇటీవల కారు ప్రమాదానికి గురయ్యారు. శారీరకంగా పోటీల్లో పాల్గొనే పరిస్థితి లేకపోవడంతో ఆమె తప్పుకున్నారు. కంటెస్టెంట్ల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు సెయింట్ మార్టిన్ ప్రతినిధి మాడ్లీ మారియన్ వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు ఎంతో కష్టంగా ఉందని, కానీ తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
6 ఆసియా దేశాలపై నిషేధం
ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో ఆరు ప్రముఖ ఆసియా దేశాల భాగస్వామ్యం వివాదాస్పదమైంది. థాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం, లావోస్, సింగపూర్, మలేషియా దేశాలు ఈ సారి పోటీల్లో పాల్గొనలేకపోతున్నాయి. ఆయా దేశాల్లోని ఫ్రాంచైజీలు, కార్పొరేట్ స్థాయిలో నెలకొన్న అంతర్గత వివాదాల కారణంగానే వీటి భాగస్వామ్యంపై వేటు పడినట్లు నివేదికలు చెబుతున్నాయి.
భారత్ తరఫున బరిలో కేరళ యువతి కాజియా
ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో ఉన్న జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలీజియంలో 'మిస్ యూనివర్స్ 2026' ఫినాలే జరగనుంది. ఇక ఈ ప్రతిష్టాత్మక వేదికపై భారత్ తరఫున కేరళలోని మావెలిక్కరకు చెందిన 19 ఏళ్ల కాజియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆగస్టు 23, 2026న జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని ఆమె గెలుచుకున్న విషయం తెలిసిందే.













Click it and Unblock the Notifications
