ఆఫీస్ రొమాన్స్.. సీక్రెట్ అఫైర్లు! ప్రపంచ కుబేరుల సీక్రెట్ లవ్ స్టోరీలు!!
బ్లూ-చిప్ కంపెనీల బోర్డురూమ్‌లలో కోట్లాది రూపాయల వ్యాపార ఒప్పందాలు, స్టాక్ మార్కెట్ వ్యూహాలే కాదు.. అప్పుడప్పుడు కొన్ని రహస్య అఫైర్లు కూడా చిగురిస్తుంటాయి. ఎంతటి గొప్ప స్థానాల్లో ఉన్నా, మనిషి సహజ బలహీనతలు, భావోద్వేగాలకు కార్పొరేట్ దిగ్గజాలు కూడా అతీతులు కారని నిరూపించే ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ వ్యవహారంతో మరోసారి కార్పొరేట్ బాసుల వ్యక్తిగత జీవితాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీరి లవ్ స్టోరీలు ఒక్కోసారి విడాకులు, కోట్లాది రూపాయల పరిహారం, సీఈవో కుర్చీని కోల్పోవడం.. కొన్నిసార్లు ఏకంగా గూఢచర్యం ఆరోపణ వరకు దారితీశాయి. అలాప్రపంచాన్ని కుదిపేసిన టాప్ సీఈవోల ఆఫీస్ రొమాన్స్ స్టోరీల గురించి తెలుసుకుందాం.
1.జెన్సెన్ హువాంగ్: ఏఐ రారాజును చుట్టుముట్టిన వివాదాలు
ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ కంపెనీ ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ ప్రస్తుతం వ్యాపారం కంటే తన వ్యక్తిగత జీవితంతోనే వార్తల్లో నిలిచారు. నవంబర్ 2026లో తన భార్యకు ద్రోహం చేసినట్లు అంగీకరిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, సహోద్యోగులకు క్షమాపణ చెప్పారు. ఎన్విడియాకు పెద్ద కస్టమర్ అయిన సింగపూర్ కంపెనీ 'మెగాస్పీడ్' మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.
ఈ వివాదం నడుస్తుండగానే ఎన్విడియా హెల్త్ కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో కూడా జెన్సెన్ హువాంగ్ కు అఫైర్ ఉన్నట్లు మరో బాంబు పేలింది. మార్చి 2026లో శాన్ జోస్‌లో జరిగిన ఓ సదస్సు సందర్భంగా వివాహితులైన వీరిద్దరూ ఓ హోటళ్లో కలుసుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై అమెరికా అధికారులు, ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణ చేపట్టాయి. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.

2.ఆండీ బైరాన్: కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో దొరికిపోయిన సీఈవో
కార్పొరేట్ రహస్యాలు నాలుగు గోడల మధ్యే ఉంటాయనుకుంటే పొరపాటే. జులై 2025లో అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన 'కోల్డ్‌ప్లే ' మ్యూజిక్ కాన్సర్ట్‌లో 'ఆస్ట్రోనామర్' కంపెనీ సీఈవో ఆండీ బైరాన్, అదే కంపెనీ హెచ్ఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్ అడ్డంగా దొరికిపోయారు. స్టేడియం బిగ్ స్క్రీన్‌పై 'కిస్ క్యామ్' వీరిద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఉండటాన్ని చూపించింది. కెమెరా తమపై పడగానే ఇద్దరూ ముఖాలు దాచుకునే ప్రయత్నం చేశారు. దీనిపై సింగర్ క్రిస్ మార్టిన్ 'వీరిద్దరి మధ్య అఫైర్ అయినా నడుస్తుండాలి, లేదా వీరు చాలా సిగ్గుపడేవారై ఉండాలి' అని ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో వివాహితులైన ఆ ఇద్దరు ఉన్నతాధికారుల గుట్టు రట్టయింది. బోర్డు విచారణ తర్వాత ఆండీ బైరాన్ సీఈవో పదవికి రాజీనామా చేయగా.. క్రిస్టిన్ కూడా కంపెనీని వీడాల్సి వచ్చింది.
3. జెఫ్ బెజోస్: విడాకుల నుంచి వెనిస్ వివాహం వరకు..
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ లు లవ్ స్టోరీ అంతర్జాతీయ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. జనవరి 2019లో బెజోస్ తన భార్య మెకెంజీ స్కాట్‌తో 25 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో లారెంజ్ సాంచెజ్‌తో ఆయన సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రైవేట్ ఫోటోలతో ఓ ట్యాబ్లాయిడ్ తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని జెఫ్ బెజోస్ ఆరోపించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత తమ బంధాన్ని బహిరంగంగా అంగీకరించిన ఈ జంట.. జూన్ 27, 2025న ఇటలీలోని వెనిస్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు.
4. బిల్ గేట్స్ : 20 ఏళ్ల నాటి అఫైర్.. బోర్డు విచారణ
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితం కూడా వివాదాలకు అతీతం కాదు. దాదాపు 20 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లోని ఓ మహిళా ఉద్యోగితో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు మే 2021లో బిల్ గేట్స్ అంగీకరించారు. దీనిపై 2019లో ఫిర్యాదు అందడంతో మైక్రోసాఫ్ట్ బోర్డు న్యాయసంస్థతో విచారణ జరిపించింది. ఈ పరిణామాల మధ్యే మార్చి 2020లో బిల్ గేట్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. సరిగ్గా మే 2021లోనే బిల్ గేట్స్, మెలిండా గేట్స్ తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.
5. స్టీవ్ ఈస్టర్‌బ్రూక్: నిజం దాచి 105 మిలియన్ డాలర్లు కోల్పోయారు..
కంపెనీ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని మెక్‌డొనాల్డ్స్ మాజీ సీఈవో స్టీవ్ ఈస్టర్‌బ్రూక్ ఉదంతం నిరూపించింది. ఒక ఉద్యోగితో సంబంధం పెట్టుకున్నందుకు నవంబర్ 2019లో ఆయనను తొలగించారు. అయితే తనకు ఇతర ఉద్యోగులతో కూడా సంబంధాలు ఉన్న విషయాన్ని ఆయన కంపెనీ వద్ద దాచిపెట్టారు. జులై 2020లో అంతర్గత విచారణలో ఈ నిజం బయటపడింది. పెట్టుబడిదారులను తప్పుదోవ పెట్టించినందుకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆయనకు 4 లక్షల డాలర్ల జరిమానా విధించడంతో పాటు ఐదేళ్ల పాటు ఏ పబ్లిక్ కంపెనీలో డైరెక్టర్ కాకుండా నిషేధం విధించింది. అంతేకాదు మెక్‌డొనాల్డ్స్ సంస్థ ఆయన నుంచి 105 మిలియన్ డాలర్ల నగదు, షేర్లను వెనక్కి తీసుకుంది.














Click it and Unblock the Notifications
