ఈ సినిమాలు సంగతి ఇక మర్చిపోవడమేనా.. రిలీజ్ అవుతాయా ? లేదా ??
ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు ప్రారంభమవుతున్నప్పటికీ, వాటిలో కొన్ని మాత్రమే అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన వివాదాలు, సెన్సార్ సమస్యలు, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వంటి కారణాలతో సంవత్సరాల తరబడి విడుదలకు నోచుకోకుండా నిలిచిపోతుంటాయి. ప్రస్తుతం తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న పలు ప్రతిష్ఠాత్మక చిత్రాలు ఉన్నాయి.
స్టార్ హీరోలు, ప్రముఖ దర్శకులు కలిసి తెరకెక్కించిన ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. వీటిలో.. విక్రమ్ 'ధ్రువ నక్షత్రం', విజయ్ సేతుపతి 'ట్రైన్'.. మిస్కిన్ 'పిశాచి 2'.. విజయ్ 'జననాయకన్', నివిన్ పౌలీ చిత్రాలు.. ఇలా పలు ప్రాజెక్టులు సంవత్సరాలుగా విడుదల కోసం వేచి ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేకపోతున్నాయి.

'ధ్రువ నక్షత్రం'.. పదేళ్లుగా సాగుతున్న నిరీక్షణ
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం విక్రమ్ హీరోగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధ్రువ నక్షత్రం'. 2015లో భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అనేక అవాంతరాలను ఎదుర్కొంది. షూటింగ్ పూర్తయినప్పటికీ ఫైనాన్షియల్ సమస్యలు, న్యాయపరమైన వివాదాలు చిత్రాన్ని విడుదలకు దూరం చేశాయి. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్లు ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా పడింది.
ఇటీవల కేసును విచారించిన కోర్టు, బకాయిలు చెల్లిస్తే చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అయితే రిలీజ్‌కు కావాల్సిన ఏర్పాట్ల కోసం మరింత సమయం కావాలని దర్శకుడు గౌతమ్ మీనన్ మళ్లీ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు.
విజయ్ సేతుపతి 'ట్రైన్'.. ల్యాబ్‌లోనే నిలిచిపోయిన ప్రయాణం
విజయ్ సేతుపతి హీరోగా, విభిన్న కథాంశాల దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న 'ట్రైన్' కూడా ఆలస్యమైన చిత్రాల్లో ఒకటి. 2023లో ప్రారంభమైన ఈ సినిమా కథ మొత్తం దాదాపు ఒక రైలు ప్రయాణం చుట్టూనే సాగుతుందని తెలుస్తోంది. సినిమాలో భారీ స్థాయిలో VFX, CGI పనులు ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటోంది. అందుకే ఇప్పటివరకు అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు.
'పిశాచి 2' ..
మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన మరో చిత్రం 'పిశాచు 2'. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. కానీ అనేక కారణాలతో విడుదల పదేపదే వాయిదా పడుతోంది. ప్రముఖ నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఒకప్పుడు భారీ హైప్ ఏర్పడింది. కానీ ఇప్పుడు సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై నిర్మాతల నుంచి కూడా స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
'జననాయకన్'.. విజయ్ రాజకీయాల ప్రభావమా?
దళపతి విజయ్ నటించిన చివరి సినిమాగా ప్రచారం పొందిన 'జననాయకన్' చుట్టూ కూడా అనేక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం సెన్సార్, లీగల్ అంశాల కారణంగా కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొంది. కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పరిష్కారం దిశగా అడుగులు పడినప్పటికీ సినిమా విడుదల మాత్రం ముందుకు సాగలేదు.
తమిళనాడు ఎన్నికల తర్వాత విడుదల అవుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా వస్తుందని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. నిర్మాతలు త్వరలో విడుదల చేస్తామని చెబుతున్నప్పటికీ ఖచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించడం లేదు.
నివిన్ పౌలీ సినిమాలకూ అదే పరిస్థితి..
మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ నటించిన 'యుజు మలై' 'యుజు కాదల్' చిత్రం కూడా చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తుంది. షూటింగ్ పూర్తయినా వివిధ కారణాలతో రిలీజ్ కావడం లేదు. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే మరోవైపు సూర్య నటించిన 'కరుప్పు', ప్రదీప్ రంగనాథన్ చిత్రం 'లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ' వంటి సినిమాలు ఆలస్యమైనప్పటికీ చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో ప్రస్తుతం నిలిచిపోయిన చిత్రాల అభిమానులు కూడా తమ అభిమాన హీరోల సినిమాలు త్వరలో విడుదల అవుతాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications