గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న పలు ముఖ్యనగరాల్లో సైతం ఈ కొత్త వేధిస్తోంది. ఈ సమస్య కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల నిర్వాహకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా రెస్టారెంట్లలో వంటకాలు ఎక్కువగా గ్యాస్‌పై ఆధారపడే నేపథ్యంలో సిలిండర్ల సరఫరా నిలిచిపోవడం పెద్ద సమస్యగా మారింది. చాలాచోట్ల గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొన్ని చోట్ల ఇండక్షన్ స్టౌలను ఉపయోగిస్తుండగా, మరికొన్ని రెస్టారెంట్లు పాతకాలపు విధానమైన కట్టెల పొయ్యిలను మళ్లీ ఉపయోగించడం ప్రారంభించాయి.
అంతే కాకుండా గ్యాస్ కొరత కారణంగా కొన్ని హోటళ్లలో మెనూలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే దోశ, చపాతి వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఫుడ్ వ్యాపారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా హోటళ్లు తాత్కాలికంగా మూతపడే పరిస్థితి వస్తుందని హోటల్ రంగానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులు వల్ల సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

యంగ్ హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉషా ముల్పూరి "ఉషా ముల్పూరి కిచెన్" అనే రెస్టారెంట్ నడుపుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ హోటల్ లో ఆంధ్రా వంటకాలు, మటన్ కుక్కర్ పులావ్ వంటి ప్రత్యేక వంటకాలు బాగా పేరు తెచ్చుకున్నాయి. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న గ్యాస్ కొరత కారణంగా వంటలను కట్టెల పొయ్యిపై చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉషా ముల్పూరి తాజాగా ఒక వీడియోలో వెల్లడించారు. ఉదయం నుంచే ఆరుబయట పొగతో కూడిన పరిస్థితుల్లో తమ సిబ్బంది పని చేస్తున్నారని ఆమె చెప్పారు.
ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ..
గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో మేము కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచే మా సిబ్బంది పని మొదలుపెడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు పొగ ఉండటంతో చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ మా వద్దకు వచ్చే కస్టమర్లను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో వంట ఆపకుండా కొనసాగిస్తున్నాం" అని ఆమె తెలిపారు. అలాగే గ్యాస్ సమస్య ఉన్నప్పటికీ కొన్ని వంటకాలను ప్రతిరోజూ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తమ రెస్టారెంట్‌కు వచ్చే అతిథులు ఆకలితో వెనుదిరగకూడదనే ఉద్దేశంతోనే కష్టపడి వంట చేస్తున్నామని తెలిపారు. గ్యాస్ సరఫరా త్వరగా సాధారణ స్థితికి చేరుకోవాలని, హోటల్ వ్యాపారులు మళ్లీ సాధారణంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి రావాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications