చిలకలూరిపేటలో బాలయ్య సంచలన రికార్డ్
నందమూరి నటసింహం బాలయ్య రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నారు. ప్రస్తుతం ఉన్న అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కన్నా ముందున్నారనేకన్నా దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు, అభిమానులకు అందించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ సినిమాలతో బాలయ్య తన స్టామినాను విపరీతంగా పెంచేసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా బాలయ్య గురించే చర్చ నడుస్తుంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో ఎంతో గ్రాండ్ గా అక్కడి ప్రజలు, అభిమానులు బాలయ్యను సన్మానించారు.
కెరీర్ పరంగా బాలయ్య శరవేగంగా దూసుకుపోతున్నారు
ఇలా కెరీర్ పరంగా, రాజకీయాల పరంగా ముందుకు దూసుకుపోతున్న బాలకృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సరికొత్త రికార్డును సృష్టించారు. మొన్న సంక్రాంతికి విడుదలైన డాకూ మహారాజ్ చిత్రం రామకృష్ణ థియేటర్ లో 100 రోజులు పూర్తిచేసుకుంది. అఖండ నుంచి డాకూ మహారాజ్ వరకు అన్ని సినిమాలు ఇదే థియేటర్ లో శతదినోత్సవం పూర్తిచేసుకొని కొత్త రికార్డును నెలకొల్పాయి. అఖండ 175 రోజులు ఆడింది. ఒక హీరోకు చెందిన నాలుగు సినిమాలు వరుసగా శతదినోత్సవాలు జరుపుకోవడం ఇదే మొదటిసారి. గతంలో బాలయ్య సినిమాలు చాలావరకు చిలకలూరిపేటలో శతదినోత్సవం, సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకూ మహారాజ్ రూ.186 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది.

డబుల్ హ్యాట్రిక్ ఖాయం అంటున్న అభిమానులు
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న అఖండ2లో అఘోరాగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించబోతున్నారు. అంతేకాదు.. ఈ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మరోసారి సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో వీరసింహారెడ్డి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నారు. ఈ సినిమా కోసం అనిల్ విభిన్నమైన కథను తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. యువ దర్శకులతో ఈ రెండు సినిమాలు చేస్తున్న బాలయ్య కచ్చితంగా డబుల్ హ్యాట్రిక్ కొడతారని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications