చేయలేనప్పుడు ఒప్పుకోవడం ఎందుకు.. దిక్కుతోచని స్థితిలో పవన్ నిర్మాతలు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. కీలక సమీక్షలు, జిల్లాల పర్యటనలు, ప్రజలతో మమేకం ఇలా క్ష‌ణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇవన్నీ కాకుండా సనాతన ధర్మం కోసం అంటూ యాత్రకు శ్రీకారం చుట్టి అటు కూడా కవర్ చేసేస్తున్నారు. ఈ పరిణామాలతో రాజకీయంగా పవన్ ఎదుగుదల బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆయనను నమ్ముకున్న నిర్మాతలకు మాత్రం ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టు తయారయ్యింది పరిస్థితి.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్స్ ముందు వరుసగా.. 'OG', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' వంటి సినిమాలను ఒప్పేసుకొని ఆ డబ్బులను పాలిటిక్స్ కోసం వాడేసుకున్నారు. తీరా ఎలక్షన్స్ లోపు ఆ సినిమాలు కంప్లీట్ కాకపోవడం.. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు రాజకీయాల్లో తలమునకలై ఉండటంతో .. తన డేట్స్‌ను ప్లాన్ చేయకుండా నిర్మాతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.

pawan-kalyan-upcoming-movies-producers-in-a-state-of-confusion

పవన్ బిజీ షెడ్యూల్ వల్ల ఓజీ సంగ‌తేమో కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మల్లు సినిమాపై మాత్రం స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే వాయిదాల విషయంలో రికార్డు కొట్టేలా ఉన్న ఈ సినిమా మొత్తానికి మే9 న రిలీజ్ పక్కా అంటూ నిర్మాతలు పోస్టర్స్ వేస్తునే ఉన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే సినిమా రిలీజ్ కష్టమే అని భావిస్తున్నారు. ఇటీవ‌ల‌ ఈ చిత్రం డబ్బింగ్ కూడా స్టార్ట్ అయిందని ప్రకటించారు. పవన్ క‌ళ్యాణ్‌ ఓ వారం రోజులు డేట్స్ ఇస్తే చిత్ర షూటింగ్ పూర్తి అయిపోతుందని చెప్పుకొచ్చారు.

కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ వల్ల డేట్స్ ఇవ్వకపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడడం పక్కా అని అంటున్నారు. ఆ స‌న్నివేశాలు లేకుండా సినిమాని విడుద‌ల చేయాల‌న్నా కూడా.. ఆ సీన్స్ మూవీకి అత్యంత కీల‌క‌మైన స‌న్నివేశాలని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. మరోవైపు గ‌త వారమే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లో అగ్నిప్రమాదం జరగడంతో హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్ళడం.. రెండు రోజులు అక్కడే ఉండడం.. ఇండియాకి తిరిగి రావడం జరిగింది. అయితే ప్ర‌స్తుతం పవ‌న్ క‌ళ్యాణ్ సినిమా షూటింగ్ చేసే మూడ్‌లో లేడ‌ని మ‌రో వారం రోజులు ఆగ‌మ‌న్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. దీంతో నిర్మాత ఏఏం ర‌త్నం దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నార‌ట‌.

భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, సునీల్‌, నాజర్‌, కబీర్‌ సింగ్‌, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పవన్ తో మూవీ అనడంతో భారీ తారాగణాన్ని తీసుకున్నారు. ఆ ఎఫెక్ట్ తోనే ఈ చిత్రం ఇప్ప‌టికే 300 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ దాటేసిందని కూడా సినీ వర్గాలలో చర్చ నడుస్తోంది.

pawan-kalyan-upcoming-movies-producers-in-a-state-of-confusion

మరోవైపు మే నెలలో చిత్రాన్ని విడుదల చేయకపోతే అమెజాన్ ప్రైమ్ సంస్థ కాంట్రాక్టు రద్దు చేసుకుంటామని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇంత తతంగం జరుగుతుండడంతో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ని ఓ తెగ వెనకేసుకొస్తున్న ఏఎం రత్నం ఇప్పుడు అందుకే సైలెంట్ అయిపోయారని అంటున్నారు. మొదటి పార్ట్ విడుదల చేయడానికే దిక్కు లేదు.. రెండో పార్ట్ సంగతి ఇక దేవుడెరుగు అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. మెగా ఫ్యామిలీ, రాజకీయంగా అధికారంలో ఉండడంతో పవన్ ను ప్రశ్నించే వారే లేకుండా పోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే అంతూపొంతూ లేకుండా పోయింది. హరీష్ శంకర్ కానీ, మైత్రీ మూవీ మేకర్స్ కానీ ఆ సినిమా గురించి అసలు మాట్లాడడం మానేశారు. ఈ పరిస్థితుల్లో ఈ మూడు సినిమాల నిర్మాతలు, నటీనటులు, యూనిట్ సభ్యులు.. ఇలా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓపెన్ గానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు నిర్మాతలు పవన్‌పై నమ్మకాన్ని కోల్పోతున్నారని.. భవిష్యత్తులో ఆయనతో సినిమాలు చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం.

రాజకీయాల పైనే ఫోకస్ చేస్తున్నప్పుడు సినిమాలకు కమిట్ అయ్యే అవసరం ఏంటని అంటున్నారు. తన సినిమా కెరీర్‌ను గౌరవంగా ముగించాలన్నా.. అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ కి రివర్స్ అవ్వకుండా ఉండాలంటే పవన్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ పవన్ ఏం చేయబోతున్నారు..? సినిమాలను త్వరగా కంప్లీట్ చేసి రాజకీయాలు చూసుకుంటారా ? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+