రూ.వంద కోట్ల ఆస్తి కానీ రూ. 50 దొరక్క ఆత్మహత్య - పోసాని

తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి పోసాని కృష్ణమురళి. తన ముక్కుసూటితనం, విభిన్నమైన డైలాగ్ డెలివరీ, బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు అనుభవాలు, కుటుంబం కోసం చేసిన త్యాగాలు, తండ్రి ఆత్మహత్య, పేదరికం గురించి మాట్లాడిన ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచే చదువుతో పాటు జీవిత పోరాటాన్ని కూడా ఎదుర్కొన్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో చెన్నై చేరుకుని సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డట్టు ఓపెన్ అయ్యారు.

posani-krishna-murali-interesting-comments-about-his-film-career-and-personal-life-also-father-suici

సినీ కెరీర్..

మొదట ప్రముఖ రచయిత పూసల రాధాకృష్ణమూర్తి వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన.. తర్వాత పరుచూరి బ్రదర్స్ వద్ద అసోసియేట్‌గా చేరారు. అక్కడే కథల నిర్మాణం, డైలాగ్ రైటింగ్, స్క్రీన్‌ప్లే మీద పట్టు సాధించారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం వల్ల తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. రచయితగా పోసానికి అసలైన బ్రేక్ ఇచ్చిన చిత్రం 'పవిత్ర బంధం'. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పోసాని పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.

ఆ తర్వాత 'పెళ్లిచేసుకుందాం', 'గోకులంలో సీత', 'గాయం', 'రక్షకుడు', 'గణేష్' వంటి వరుస హిట్ సినిమాలకు కథలు, డైలాగులు అందించారు. దాదాపు 100కు పైగా చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆయన.. కుటుంబ కథలు, సామాజిక అంశాలు, రాజకీయ సెటైర్లు, ఎమోషనల్ డైలాగ్స్ రాయడంలో ప్రత్యేక శైలి సంపాదించుకున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు పోసాని డైలాగులు ఉండాల్సిందే అనే స్థాయికి ఎదిగారు.

దర్శకుడిగా సంచలనం..

రచయితగా విజయాలు సాధించిన తర్వాత పోసాని దర్శకత్వం వైపు అడుగులు వేశారు. 'శ్రావణమాసం' సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన.. తర్వాత తెరకెక్కించిన 'ఆపరేషన్ దుర్యోధన' భారీ సంచలనం సృష్టించింది. రాజకీయ వ్యవస్థలోని అవినీతి, అధికారం కోసం జరిగే డ్రామాలను బహిర్గతం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ తర్వాత 'మెంటల్ కృష్ణ', 'పోసాని జెంటిల్మన్' వంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. ఆయన సినిమాల్లో రాజకీయ సెటైర్లు, సమాజంపై విమర్శలు ఎక్కువగా కనిపించేవి. పోసాని కెరీర్‌లో అతిపెద్ద మలుపు మాత్రం నటుడిగానే వచ్చింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయన.. 'బాబీ' సినిమాలో కనిపించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు.

'నాయక్', 'టెంపర్', 'రేసుగుర్రం', 'అత్తారింటికి దారేది', 'ధృవ' వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా 'టెంపర్' సినిమాలో హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. కామెడీ, విలనిజం, ఎమోషన్.. ఏ పాత్ర అయినా సులభంగా చేయగల నటుడిగా పోసాని పేరు తెచ్చుకున్నారు.

రూ.50 అప్పు దొరకక తండ్రి ఆత్మహత్య

తాజా ఇంటర్వ్యూలో పోసాని చెప్పిన విషయాల్లో అత్యంత భావోద్వేగానికి గురిచేసింది తన తండ్రి మరణం. కేవలం రూ.50 అప్పు దొరకకపోవడంతో తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. "మా నాన్న చాలా అమాయకుడు. పేకాట అలవాటు వల్ల ఉన్న ఆస్తులన్నీ పోయాయి. చివరకు ఒక తాటాకు ఇల్లు మాత్రమే మిగిలింది. అప్పట్లో రూ.50 కూడా దొరకలేదు. ఆ అవమానం, పేదరికం తట్టుకోలేక ఆయన ప్రాణాలు తీసుకున్నారు" అని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.100 కోట్ల ఆస్తి.. కానీ తన పేరుపై ఏమీ లేదు!

ఇప్పటికే సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన పోసాని ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా ఆస్తి సంపాదించారని చెప్పారు. అయితే ఆ ఆస్తిలో ఒక్క పైసా కూడా తన పేరు మీద లేదని వెల్లడించి షాక్ ఇచ్చారు. "నా ఆస్తి మొత్తం నా భార్య పేరుమీదే ఉంది. నాకు నా కుటుంబం లక్ష కోట్ల కంటే విలువైనది. 33 ఏళ్ల వైవాహిక జీవితంలో నా భార్య ఒక్కరోజు కూడా నన్ను బాధ పెట్టలేదు" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

రాజకీయాల్లోనూ పోసాని స్టైల్ వేరు

సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పోసాని చురుకుగా వ్యవహరించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తర్వాత వైఎస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ప్రెస్ మీట్లలో ఆయన మాట్లాడే విధానం తరచూ వివాదాలకు దారి తీసేది. అయినప్పటికీ తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APFDC చైర్మన్‌గా నియమించింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+