రామ్‌చరణ్ సరసన తెలుగమ్మాయి? స్టార్ హీరోయిన్లను కాదని సుకుమార్ కొత్త ప్లాన్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకోనున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఆర్సీ 17'. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటించనున్నారనే అంశంపై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటివరకు ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ కోసం సారా అర్జున్, అనస్వర రాజన్, అనీత్ పడ్డా వంటి పలువురు ప్రముఖ కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ జాబితాలోకి మరో కొత్త పేరు చేరడం విశేషం. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ సారి ఓ తెలుగమ్మాయి పేరు తెరపైకి వచ్చింది.
తెరపైకి సాత్విక వీరవల్లి పేరు?
ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ 17వ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొత్త నటి సాత్విక వీరవల్లి పేరును చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాత్విక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది. ఇప్పటికే దక్షిణాదిలోని ఎంతో మంది క్రేజ్ ఉన్న నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ.. సుకుమార్ మాత్రం ఓ కొత్త అందం కోసం.. అదీ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అయితే పాత్రకు సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే కెరీర్ ప్రారంభంలోనే రామ్ చరణ్ వంటి పాన్-ఇండియా స్టార్ సరసన.. సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశం ఈ తెలుగమ్మాయికి దక్కినట్లే.

అయితే హీరోయిన్ ఎంపికపై మైత్రీ మూవీ మేకర్స్ కానీ, డైరెక్టర్ సుకుమార్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
