టాలీవుడ్ పై తెలంగాణ పోలీస్ ఫోకస్.. ఇప్పుడు సాయి తేజ్, నెక్స్ట్ ఎవరంటే ?
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యవహారాలను అసలు ఉపేక్షించేది లేదంటూ కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ ఇష్యూ టాలీవుడ్ ని సైతం కుదిపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నిర్మాత హస్తం ఉండడం.. పలువురు సెలబ్రిటీలు సైతం ఆయనతో టచ్ లో ఉన్నారని గత కొంతకాలంగా హాట్ డిస్కషన్ నడుస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. 'గాంజా శంకర్' అనే టైటిల్ తో ఆ సినిమాని రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా ఓ వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేశారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రాకపోవడంతో అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి.

అయితే ఈ వ్యవహారంపై దర్శకుడు సంపత్ నంది రియాక్ట్ అయ్యారు. సంపత్ డైరెక్షన్ చేసిన ఓదెల 2 మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమాను ఆపేశాం అంటూ చెప్పి ఊహించని షాక్ ఇచ్చారు. గాంజా శంకర్ సినిమా విషయంలో తనకు, హీరో సాయి దుర్గా తేజ్ కు, నిర్మాతకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు.
సదరు నోటీసుల్లో మూవీ పేరులో గాంజా పదాన్ని తొలగించాలని నోటీసులో సూచించారని చెప్పారు. అంతే కాకుండా సినిమాలో మాదకద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతరక సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ - 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చారించారన్నారు. సినిమా టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రభావం చూపుతుందని.. గంజాయి సన్నివేశాలు డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో ఉందన్నారు. కానీ కథను బట్టి టైటిల్ పెట్టామని ఇప్పుడు టైటిల్ మార్చితే.. కథ పూర్తిగా మార్చాల్సి వస్తుందని అందుకే సినిమా ఆపేయడమే మంచిది అనిపించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
ఇక మరోవైపు సాయిదుర్గా తేజ్ 'సంబరాల యేటిగట్టు' అనే సినిమాలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు కేపీ రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దీంతో రాబోయే రోజుల్లో సైతం సినిమాల విషయంలో కూడా తెలంగాణ పోలీసుల ఫోకస్ ఉంటుందని అర్ధం అవుతుంది. డ్రగ్ ఫ్రీ తెలంగాణనే ధ్యేయం అంటున్న ప్రభుత్వం ఆదేశాలతో.. సినిమాల్లో కూడా ఆ తరహా కంటెంట్ విషయంలో పోలీసులు స్ట్రిక్ట్ గా ఉంటున్నారని అర్దం అవుతోంది. ఇక రానున్న రోజుల్లో సైతం ఎలా ఉంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications