Sardar 2 Movie Review: సర్దార్ 2 మూవీ రివ్యూ.. సిల్లీ సీక్వెల్ ప్రో మ్యాక్స్!
Sardar 2 Movie Review: స్టార్ హీరో కార్తీ, విలక్షణ దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందో. ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'సర్దార్ 2' గురువారం(సెప్టెంబర్ 10) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కార్తీ మరోసారి డబుల్ రోల్‌లో కనిపించగా.. ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా కీలక పాత్ర పోషించగా.. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. తొలి భాగంలో నీటి సంక్షోభం వంటి సామాజిక అంశాలను స్టోరీలో చూపించిన పీఎస్ మిత్రన్.. ఈ సారి ఏ అంశాన్ని తీసుకున్నారు.. సర్దార్ మరోసారి ఆకట్టుకున్నాడా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ
సర్దార్ మరణించాడని భావించి అతని కొడుకు విజయ్(కార్తీ) తన విధులపై దృష్టి సారిస్తాడు. 'రా' ఏజెంట్ గా పనిచేస్తున్న విజయ్ క్రమశిక్షణా చర్యల కారణంగా ఓ సాధారణ విభాగంలో పనిష్మెంట్ పోస్టింగ్ లో ఉంటాడు. తన కెపాసిటీ నిరూపించుకుని మళ్లీ ప్రధాన విభాగంలోకి వెళ్లాలని భావిస్తున్న సమయంలో ఓ ఏజెంట్ ను కనిపెట్టే క్రమంలో మళ్లీ డిసిప్లినరీ కమిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రమాదకరమైన 'మిషన్ డోకు' అనే కుట్ర గురించి తెలుస్తుంది. బ్లాక్ డాగర్ అని పిలువబడే సూర్య అండ్ గ్యాంగ్ ఈ మిషన్ ను అమలు చేయడానికి రంగంలోకి దిగినట్లు గుర్తించిన విజయ్.. వారి అడ్డుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ ప్రక్రియలోనే తన తండ్రి సర్దార్ కు సంబంధించిన కొన్ని సంచలనాత్మక నిజాలు బయటపడతాయి. అసలు ఈ బ్లాక్ డాగర్ ఎవరు? రా ఏజెంట్లను ఎందుకు టార్గెట్ చేశాడు? విజయ్ ఈ మిషన్ ను ఎలా ఛేదించాడనే విషయం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
డైరెక్టర్ పీఎస్ మిత్రన్ మొదటి భాగంలో ప్లాస్టిక్ బాటిళ్ల వల్ల కలిగే ప్రమాదాలను కోర్ పాయింట్ గా చూపిస్తే.. ఈ సీక్వెల్లో కృత్రిమ మాంసాహార ఉత్పత్తులు, మానవ శరీరానికి అతిగా మందులు, యాంటీబయోటిక్స్ అలవాటు చేయడం వల్ల వచ్చే ముప్పును ప్రధానాంశంగా ఎంచుకున్నారు. ఈ సామాజిక సందేశం కలిగిన స్పై కాన్సెప్ట్ నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ఫస్టాఫ్ ప్రారంభంలో కొంత కన్ఫ్యూజన్ అనిపించినా, మిషన్ ఏంటి, పాత్రల నేపథ్యం ఏమిటనేది ఎస్టాబ్లిష్ చేస్తూ కథను ఆసక్తికరంగా నడిపించారు. ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్ పై భారీ అంచనాలను పెంచుతుంది.
అయితే సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిస్తుంది. స్టోరీలో రొటీన్ ఫార్ములా సీన్లు, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ డ్రామా ప్రేక్షకుడికి ముందే ఊహించగలిగేలా ఉండటం కాస్త నిరాశపరుస్తుంది. ఫస్టాఫ్ లో వర్కవుట్ అయిన ఎమోషన్స్ ను సెకండాఫ్ ముగింపు వరకు సరిగ్గా క్యారీ చేయడంలో డైరెక్టర్ తడబడ్డాడు. యాంటీబయోటిక్ మెకానిజమ్స్ గురించి చెప్పిన విధానం బాగున్నప్పటికీ.. డ్రామా ఎంగేజింగ్‌గా లేకపోవడంతో ప్రేక్షకుడు కథతో పూర్తిగా మమేకం కావడం కాస్త కష్టమవుతుంది.
ఎవరెలా నటించారంటే?
కార్తీ మరోసారి తండ్రీకొడుకులుగా డబుల్ రోల్ లో తన మార్క్ నటనను కనబరిచారు. అయితే ఓల్డ్ సర్దార్ మేకప్ విషయంలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. ఆషికా రంగనాథ్ యాక్షన్ సీన్లలో మెరవగా.. మాళవికా మోహనన్ తన సాధారణ గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఆకట్టుకుంది. విలన్ గా ఎస్జే సూర్య నటన కొన్ని సీన్లలో ఓవర్ ది టాప్‌గా, లౌడ్ గా అనిపించినా తన నటనతో అలరించారు. ఆశిష్ విద్యార్థి, నాజర్ తన అనుభవంతో పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం
సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పాటలు పెద్దగా గుర్తుండకపోయినా, యాక్షన్ సన్నివేశాల్లో రీ-రికార్డింగ్ ఎఫెక్టివ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ ను గ్రాండ్ గా ప్రెజెంట్ చేసింది. అయితే కొన్ని యాక్షన్ సీన్లు, విమాన స్టంట్స్ లాజిక్ కు దూరంగా, కాస్త అతిగా అనిపిస్తాయి. దాదాపు 3 గంటల నిడివి సినిమాకు మైనస్ గా మారింది. ఎడిటింగ్ టేబుల్ పై ఇంకాస్త కత్తెర వేసి ఉంటే సినిమా వేగం పెరిగేది. మొత్తానికి ఎలాంటి థ్రిల్స్ లేని స్టోరీ, లాజిక్ లేని సీన్లు, సుదీర్ఘమైన రన్ టైమ్‌తో వచ్చిన 'సర్దార్ 2' ఓ విఫల సీక్వెల్‌గా మిగిలిపోయింది.
ఫైనల్‌గా..
మొదటి భాగం స్థాయి మ్యాజిక్‌ను పూర్తిగా రిపీట్ చేయలేకపోయినప్పటికీ.. అంతర్జాతీయ స్పై థ్రిల్లర్స్, కార్తీ నటనను ఇష్టపడే వారు 'సర్దార్ 2' సినిమాను ఒకసారి వీక్షించవచ్చు.
*రేటింగ్: 2/5.














Click it and Unblock the Notifications
