అర్ధరాత్రి రోడ్డున పడ్డ సీనియర్ నటి.. కన్నీరు పెట్టిస్తున్న దీనస్థితి!
టాలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో రోడ్డున పడ్డారనే వార్త చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి ఆమెకు గుండెకు సంబంధించిన తీవ్రమైన ఆరోగ్య సమస్య తలెత్తడంతో హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే చికిత్సకు అవసరమైన డబ్బులు లేకపోవడంతో సదరు ఆస్పత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించి అక్కడి నుంచి పంపించివేసినట్లు తెలుస్తోంది.
ఆస్పత్రి చేర్చుకోకపోవడంతో తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమెను ఓ క్యాబ్ డ్రైవర్ అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై ఉన్న ఫుట్‌పాత్ పైనే వదిలేసి వెళ్లిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అర్ధరాత్రి సమయంలో అనారోగ్యంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై తిరుగుతున్న పావలా శ్యామలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణమే స్పందించి ఆమెను సురక్షితంగా రక్షించి.. తదుపరి ఆశ్రయం, అత్యవసర సహాయం కోసం ఆర్కే ఫౌండేషన్‌కు తరలించారు.

గతంలో కూడా పావలా శ్యామల ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ ప్రముఖులు స్పందించి ఆమెకు ఆర్ఖిక సహాయం అందించి ఆదుకున్నారు. అయినప్పటికీ వృద్ధాప్యం, నిరంతరం వేధిస్తున్న అనారోగ్య సమస్యలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సీనియర్ నటి జీవితం ప్రస్తుతం మళ్లీ అత్యంత దయనీయ స్థితికి చేరుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications