టాప్ మ్యూజిక్ డైరెక్టర్ బాగోతం బట్టబయలు.. స్టూడియోలో బంధించి సింగర్‌పై అఘాయిత్యం!
తమిళ సినీ ఇండస్ట్రీలో మరోసారి ప్రకంపనలు రేపే చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయని స్వాగత కృష్ణన్ ఓ అగ్ర సంగీత దర్శకుడిపై చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తనను స్టూడియోలో బంధించి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా వీడియో ఫుటేజీతో తనను బ్లాక్ మెయిల్ చేశాడని స్వాగత కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణమైన అనుభవాల వల్లే తాను సినీ పరిశ్రమను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్వాగత కృష్ణన్ తన జీవితంలో జరిగిన ఈ చీకటి గాధను వివరించారు. ఆమె వ్యక్తిగతంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆ మ్యుజిక్ డైరెక్టర్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. తొమ్మిదేళ్ల ప్రేమ బంధం విచ్ఛిన్నమై మానసిక ఆందోళనలో ఉన్న తనకు ఆయన ఓ గురువులా నటిస్తూ దగ్గరయ్యాడని స్వాగత కృష్ణన్ వెల్లడించారు. తన బలహీనతను ఆసరాగా చేసుకుని, నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రభావం చూపాడని ఆమె ఆరోపించారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్న భయంకరమైన విషయాలను వెల్లడించారు. తనను స్టూడియోలోని సౌండ్ ప్రూఫ్ గదిలోకి పిలిచి, బయటకు రాకుండా బంధించి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా స్టూడియోలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఆ దృశ్యాలను చూపించి, బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తనను బెదిరించాడని పేర్కొన్నారు. ఈ బ్లాక్‌మెయిలింగ్‌తో తనను మానసిక చిత్రహింసలకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
లైంగిక వేధింపులే కాకుండా, వృత్తిపరంగా కూడా ఆయన తనను మోసం చేశాడని స్వాగత కృష్ణన్ వెల్లడించారు. తనతో కోరస్ కంపోజిషన్, మిక్సింగ్ వంటి పనులు చేయించుకుని నయాపైసా రెమ్యునరేషన్ ఇవ్వలేదని.. పైగా అప్పుల్లో ఉన్నానని అబద్ధాలు చెప్పి తన దగ్గరే డబ్బులు వసూలు చేశాడని ఆమె ఆరోపించారు. తనపై తప్పుడు దొంగతనం కేసులు మోపి తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించాడని.. దీనివల్ల తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురై సైకియాట్రిక్ చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి తాను చెన్నైని వదిలి రిషికేష్‌కు వెళ్లిపోయి.. అక్కడ కొత్త జీవితం ప్రారంభించానని స్వాగత చెప్పారు. సదరు సంగీత దర్శకుడిని ఆమె "మద్రాస్ ఎప్‌స్టీన్" అని అభివర్ణించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే తరహాలో ఆయన మరికొందరు యువతులను కూడా వేధించి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన సోదరి మాయ కృష్ణన్ మద్దతుతో న్యాయపోరాటం చేస్తానని.. ఇప్పటికైనా మౌనం వీడి నిజాలు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు స్వాగత కృష్ణన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications