ఏపీ ప్రభుత్వానికి విరాళమిచ్చిన స్టార్ నటుడు
ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు దృష్టిసారించింది. ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోయిన అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేయాలని కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం ఇంకా ప్రకటించకముందే, ప్రభుత్వం కోరకపోయినప్పటికీ అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు వస్తున్నాయి. రెండురోజుల క్రితమే ఈనాడు సంస్థ చైర్మన్ కిరణ్ తన తండ్రి రామోజీరావు సంస్మరణార్థం అమరావతి నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని అందజేశారు.
ఉండి ఎమ్మెల్యేకు చెక్కు అందించిన రావు రమేష్
తాజాగా ప్రముఖ నటుడు రావు రమేష్ రూ.3 లక్షల విరాళాన్ని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు అందజేశారు. వీటిని ఉండి నియోజకవర్గంలో డ్రైనేజీ అభివృద్ధి పనులకు, నియోజకవర్గ అభివృద్ధి పనులకు వాడాలని సూచించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీచేసి విజయం సాధించిన రఘురామకృష్ణంరాజుకు ఆయన వీటిని అందజేయడం విశేషం. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో తెలుగు సినీ పరిశ్రమ సంతోషంలో ఉంది. ఇప్పుడు రావు రమేష్ స్వయంగా విరాళాన్ని అందించడంపై ప్రశంసలు వస్తున్నాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని సినీ ప్రముఖులంతా అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విరాళాలిస్తారని ఆశిస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న నటుల్లో రావు రమేష్ ఒకరు. రావు గోపాలరావు వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తన అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, హావభావాలతో ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తున్నారు.

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా
కుప్పంలో డ్వాక్రా మహిళలు రూ.4.5 కోట్ల విరాళాన్ని, ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన వైద్య విద్యార్థి అంబుల వైష్ణవి రాజధాని నిర్మాణానికి రూ.25 లక్షలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసింది. పోలవరం నిర్మాణానికి రూ.లక్ష అందించింది. విజయవాడలోని ఓ ప్రయివేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవిని సీఎం అభినందిస్తూ అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు.












Click it and Unblock the Notifications