ట్రైన్‌లో మొదటిసారి: తొలి పీరియడ్స్ అనుభవాన్ని పంచుకున్న స్టార్ సింగర్!
Shreya Ghoshal: బాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కుటుంబ సభ్యుల పూర్తి ప్రోత్సాహం, ముఖ్యంగా తన తండ్రి అందించిన అండదండల వల్లే తాను ఈ స్థాయిలో నిలబడగలిగానని ఆమె పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు. తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి శ్రేయా ఘోషల్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పటి సంఘటనను పంచుకున్నారు. ఆ సమయంలో తండ్రి తనకు అందించిన మానసిక ధైర్యాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
రైలు ప్రయాణంలో ఎదురైన అనుభవం
రైలు ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాన్ని ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పంచుకున్నారు. "సరిగమప" షూటింగ్ పూర్తి చేసుకుని తండ్రితో కలిసి రైలులో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో తనకు మొదటిసారి పీరియడ్స్ వచ్చాయని వెల్లడించారు. "రైలులో ప్రయాణిస్తున్నప్పుడు హఠాత్తుగా ఏదో అసౌకర్యంగా అనిపించింది. వెంటనే ఆ విషయాన్ని మా నాన్నకు చెప్పాను. ఆయన నన్ను ఎంతగానో ఓదార్చి, ధైర్యం చెప్పారు. మేము రైలులో ఉన్నందున మధ్యలో దిగే అవకాశం లేదు. అందుకే ఆయన తాత్కాలికంగా ఓ సర్దుబాటు చేశారు" అని శ్రేయా ఘోషల్ వివరించారు.

ఇంటికి చేరుకోగానే ప్యాడ్స్ కొనిచ్చిన తండ్రి
రైలు దిగి ఇంటికి చేరుకున్న వెంటనే తన తండ్రి ముందుగా షాపుకు వెళ్లి శానిటరీ ప్యాడ్స్ కొని తెచ్చి ఇచ్చారని శ్రేయా ఘోషల్ వెల్లడించారు. సమాజంలోని చిన్నచూపును లేదా పాతకాలపు ఆలోచనలను తన తండ్రి ఎప్పుడూ లెక్క చేయలేదని.. ప్రతి విషయంలోనూ తనను ప్రోత్సగించారని ఆమె తెలిపారు.
సమాజపు మాటలను ఎదుర్కొని ప్రోత్సాహం
తాను చిన్నతనంలో ఉన్నప్పుడు సమాజంలోని కొందరు వ్యక్తులు తన తండ్రితో "చదువు మానేసి పాటలు పాడుతుందా? కూతురి కోసం అంత శక్తిని, సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు?" అని అనేవారని శ్రేయా ఘోషల్ గుర్తుచేసుకున్నారు. అయితే తన తండ్రి ఎప్పుడూ ఆడపిల్లను తక్కువగా అంచనా వేయలేదని.. అటువంటి మాటలు విన్నప్పుడు ఆయన మరింత పట్టుదలతో తన సంగీత ప్రయాణానికి పూర్తి సహకారం అందించారని శ్రేయా ఘోషల్ భావోద్వేగంతో వెల్లడించారు.














Click it and Unblock the Notifications