ఒళ్లు గగుర్పొడిచే 77 హత్యలు.. ఓటీటీని షేక్ చేస్తున్న రియల్ క్రైమ్ స్టోరీ !!
ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ వైపు చూడాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు 'ప్రపంచ సినిమా' మన అరచేతిలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సినిమాలు కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్షమవుతుండటంతో, ఓటీటీ హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ వేదికలపై సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్‌కు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా నిజ ఘటనల ఆధారంగా రూపొందిన సిరీస్‌లు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి.
నిజ ఘటనల ఆధారంగా కథ..
అలాంటి ఆసక్తికరమైన రియల్ క్రైమ్ కథలలో ఒకటి తడయం. తమిళంలో రూపొందిన ఈ సిరీస్, తెలుగులో కూడా అందుబాటులోకి రావడంతో మరింత మంది ప్రేక్షకులను చేరుకుంది. ఈ సిరీస్ కథ 1990ల కాలానికి చెందినది. ముఖ్యంగా 1995 ప్రాంతంలో తమిళనాడులోని తిరువళ్లూరు సమీప గ్రామాల్లో చోటుచేసుకున్న వరుస హత్యలే దీనికి ప్రేరణ. గ్రామ శివార్లలో ఒంటరిగా నివసించే దంపతులను లక్ష్యంగా చేసుకుని దుండగులు దారుణంగా హత్యలు చేయడం ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది.

77 సీరియల్ హత్యలు..
ఒకే విధానంతో జరిగిన 77 హత్యలు ఈ కేసును దేశవ్యాప్తంగా సంచలనంగా మార్చాయి. ప్రతి ఘటనలో హంతకులు పురుషుల మొలతాడు, మహిళల మంగళసూత్రాలు మాత్రమే దోచుకుని వెళ్లేవారు. అంతేకాదు, సంఘటనా స్థలంలో రక్తంతో '?' గుర్తు వేసి వెళ్లడం కేసును మరింత మిస్టీరియస్‌గా మార్చింది.
ఈ కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఆధారాలు తక్కువగా ఉండటం, హంతకుల తెలివైన ప్రణాళికల వల్ల కేసు మరింత క్లిష్టమైంది. అయితే, చివరకు పోలీసులు సుదీర్ఘ దర్యాప్తుతో అసలు నిందితులను పట్టుకుని ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్న నిజాలను వెలికితీశారు.
టెక్నికల్ టీమ్ & నటీనటులు..
ఈ సిరీస్‌కు నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటించారు. అలాగే శివదా, సుందర్ పాండియన్, రాజ్ తిరందాస్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. నిర్మాతగా అజయ్ కృష్ణ వ్యవహరించారు. ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ అందుబాటులో ఉండటం విశేషం. క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఇది తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్‌గా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications