టైమ్ మ్యాగజైన్‌పై మెరిసిన తొలి భారతీయ నటి.. స్టార్ హీరోయిన్ విషాద గాథ!
బాలీవుడ్ వెండితెరపై ఒక మెరుపు తీగలా మెరిసిన అందాల హీరోయిన్ పర్వీన్ బాబీ. 70, 80వ దశకాల్లో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆమె ఓ కలికితురాయి. అప్పటి వరకు ఉన్న సంప్రదాయ నటీమణుల ఇమేజ్‌ను తన బోల్డ్ లుక్స్, వెస్ట్రన్ స్టైల్‌తో పూర్తిగా మార్చేసింది. ఆమె గ్లామర్, నటనకు అప్పట్లో దేశమంతా ఫిదా అయిపోయిందంటే అతిశయోక్తి లేదు. ఎంతలా అంటే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. అమితాబ్ బచ్చన్ వంటి సూపర్‌స్టార్లతో 'దీవార్', 'అమర్ అక్బర్ ఆంథోనీ', 'నమక్ హలాల్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ఫీమేల్ సూపర్‌స్టార్‌గా ఎదిగారు.
షాన్ షూటింగ్‌లో మొదలైన పతనం
కెరీర్ శిఖరాగ్రంలో ఉన్న సమయంలోనే పర్వీన్ జీవితంలో చీకటి రోజులు మొదలయ్యాయి. 'షాన్' సినిమా షూటింగ్ సమయంలో ఆమె ప్రవర్తనలో అనూహ్య మార్పులు వచ్చాయి. ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి, పారనోయిడ్ స్కిజోఫ్రెనియా అనే భయంకరమైన మానసిక వ్యాధికి గురయ్యారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందని, ఎవరో తనపై నిఘా పెడుతున్నారని ఆమె నిరంతరం భయపడేవారు. ఒకసారి మహేష్ భట్‌తో ప్రయాణిస్తున్నప్పుడు, కారులో బాంబు ఉందని భ్రమపడి కదులుతున్న కారులోంచి రోడ్డుపైకి దూకేశారంటే ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మానసిక వ్యాధితో పోరాటం
పర్వీన్ బాబీ వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. నటుడు కబీర్ బేడీతో ఆమె నడిపిన ప్రేమాయణం అప్పట్లో పెద్ద సంచలనం. బాలీవుడ్‌లోనే అత్యంత గ్లామరస్ జంటగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. ఆమె మానసిక స్థితి, మనస్పర్థల కారణంగా ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత ఆమె 1983లో ఉన్నట్టుండి దేశం విడిచి న్యూయార్క్‌కు వెళ్లిపోయారు. దాదాపు దశాబ్ద కాలం పాటు అజ్ఞాతంలో గడిపిన ఆమె, 1992లో తిరిగి ముంబైకి వచ్చినప్పుడు ఆమెను గుర్తుపట్టడం కూడా ఎవరికీ సాధ్యం కాలేదు. అంతలా ఆమె రూపం మారిపోయింది.
కవర్ పేజీ నుంచి అనాథ శవం వరకు..
తిరిగి వచ్చిన తర్వాత ఆమె మానసిక స్థితి మరింత దిగజారింది. అమితాబ్ బచ్చన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తనను చంపడానికి కుట్ర పన్నారని బాంబే హైకోర్టులో పిటిషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు దానిని కొట్టివేసింది. చివరి రోజుల్లో ఆమె పూర్తిగా ఒంటరి అయిపోయారు. 2005, జనవరి 22న ఆమె నివసించే ఫ్లాట్ బయట రెండు రోజులుగా పాలు, న్యూస్ పేపర్లు అలాగే పడి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులు తలుపులు బద్దలు కొట్టారు. లోపల పర్వీన్ బాబీ నిర్జీవ దేహం పడి ఉంది. ఆమె చనిపోయి మూడు రోజులు గడిచినా ఎవరికీ తెలియలేదు. ఆమె మరణించిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి కూడా కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో, ఆమె మాజీ ప్రియుడు మహేష్ భట్ అంతిమ సంస్కారాలు నిర్వహించడం గమనార్హం.












Click it and Unblock the Notifications