ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలకు ముందే సందడి మొదలైంది. ఉగాది పండుగ కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఈ సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
ప్రభుత్వ ఉత్తర్వులు.. టికెట్ ధరలు ఇలా..
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు (మార్చి 19 నుండి మార్చి 28 వరకు) పెంచిన ధరలు అమలులో ఉంటాయి. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.

బెనిఫిట్ షోల వివరాలు
మార్చి 19న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ప్రదర్శించే బెనిఫిట్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ స్పెషల్ షోలకు టికెట్ ధరను గరిష్టంగా రూ. 500గా ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో అభిమానులు అత్యంత వేడుకగా ఈ సినిమాను చూసేందుకు సిద్ధమవుతున్నారు.
సినిమా నేపథ్యం
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్-హరీశ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూ/ఏ (U/A) సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పాత్రలో పవర్‌ఫుల్ యాక్షన్, హరీశ్ శంకర్ మార్క్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications