హీరోగా 'మురారి' సినిమాను వదులుకున్న దురదృష్టవంతుడు
సూపర్ స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా వచ్చిన నాలుగో చిత్రం మురారి. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దర్శకుడు కృష్ణవంశీ తనదైనశైలిలో కుటుంబ బాంధవ్యాలు, కథ, కథనం, భావోద్వేగాలు, మణిశర్మ అద్భుతమైన సంగీతం, క్యారెక్టర్లను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం, మహేష్‌బాబు నటన కలగలిసి మురారిని బ్లాక్ బస్టర్ సినిమాగా తీర్చిదిద్దాయి. 2001 ఫిబ్రవరి 17వ తేదీన విడుదలై అఖండ విజయాన్ని అందుకోగా తాజాగా ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఇప్పుడు కూడా అంతకుమించి విజయాన్ని అందుకుంది.
రెండురోజుల్లో రూ.7.23 కోట్లు
విడుదలైన రెండు రోజుల్లోనే 7.23 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించగా, అందులో నైజాం నుంచి రూ.4.21 కోట్లు ఉండటం విశేషం. తొలిరోజే రూ.5.41 కోట్లు రాబట్టింది. ఎంతోమంది అభిమానులు మురారి రీరిలీజ్ సందర్భంగా థియేటర్లలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అంతగా ఈ సినిమా తెలుగు ప్రజలపై ప్రభావాన్ని చూపింది. ఇంతటి సినిమాను తెలుగులో ఓ హీరో వదులుకోవాల్సి వచ్చింది. మురారి కథను కృష్ణవంశీ ముందుగా అక్కినేని నాగార్జునకు వినిపించారు. నిన్నే పెళ్లాడుతా సినిమా చేసినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అన్యోన్యత ఉంది. దీంతో మురారి సినిమా చేయాలని నాగార్జునను కృష్ణ వంశీ కోరారు.

నిర్మాతగా వ్యవహరిస్తానని నాగార్జున అన్నప్పటికీ..
కథ విన్నతర్వాత నాగార్జునకు బాగా నచ్చినప్పటికీ ఈ కథతో తన మేనల్లుడు సుమంత్ ను పెట్టి తీయాలంటూ కృష్ణవంశీని కోరారు. అయితే ఈ సినిమా చేస్తే మీతో చేస్తాను.. లేదంటే మహేష్‌బాబుతో చేస్తాను.. అని ఖరాఖండిగా దర్శకుడు చెప్పేశారు. అలా నేరుగా ముఖంమీదే విషయం చెప్పేయడంతో నాగార్జున బాగా హర్టయ్యారని వార్తలు వచ్చాయి. సుమంత్ తో చేస్తే నిర్మాతగా వ్యవహరిస్తానని నాగార్జున చెప్పినప్పటికీ కృష్ణవంశీ మాత్రం నాగార్జునతోనే చేస్తానని పట్టుబట్టారు.
చివరకు మహేష్‌బాబుతో చేసి ఘనవిజయాన్ని అందించారు. అయితే ఈ సినిమా సుమంత్ చేసుంటే అతని కెరీర్ కు చాలా ఉపయోగపడేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. మురారి సినిమా అనే కాకుండా నువ్వేకావాలితోపాటు పలు బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా సుమంత్ వదులుకున్నాడు. సూపర్ హిట్ కథలన్నీ ముందుగా అతని దగ్గరకే వెళ్లేవి.












Click it and Unblock the Notifications