నిశ్శబ్దాన్ని మిగిల్చిన సీక్వెల్.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ రివ్యూ!
Dhurandhar 2: బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లో ఒకటిగా నిలుస్తున్న 'ధురంధర్ 2' గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది ప్రముఖ నటి యామీ గౌతమ్. తన భర్త ఆదిత్య ధర్ దర్శకత్వంలో, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను తాను ఇప్పటికే చూశానని, ఇది ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని ఆమె పేర్కొంది. ఢిల్లీలో జరిగిన 'రైజింగ్ భారత్ సమ్మిట్ 2026'లో పాల్గొన్న యామీ.. ఈ సినిమాపై తన రివ్యూను పంచుకుంది.
నిశబ్దాన్ని మిగిల్చిన సినిమా
సినిమా చూసిన తర్వాత తన స్పందన ఎలా ఉందో వివరిస్తూ.. "నేను ఇప్పటికే 'ధురంధర్ 2' చూశాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక అసాధారణమైన అనుభవం. సినిమా చూశాక నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ సమయంలో ఫ్లైట్ ఎక్కాల్సి రావడంతో ఆదిత్యతో ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ ప్రయాణమంతా ఆ సినిమా ప్రభావం నుంచి బయటపడలేక విమానం కిటికీలోంచి సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉండిపోయాను. నా ఫీలింగ్స్‌ను ఆదిత్యకు ఎలా వివరించాలో కూడా అర్థం కాలేదు" అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది.

ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రం
ఆదిత్య ధర్ ఈ సినిమా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశాడని యామీ ప్రశంసించింది. "ఆదిత్యకు ప్రేక్షకులన్నా, దేశమన్నా చాలా గౌరవం. అందుకే 'ఉరి' వంటి అద్భుతమైన చిత్రాలను తీశారు. ధురంధర్ మొదటి పార్ట్ షూటింగ్ సమయంలోనే ఈ సీక్వెల్ స్క్రిప్ట్ చదివాను. కేవలం 40 పేజీల స్క్రిప్ట్ చదివినప్పుడే నా కళ్లు చెమర్చాయి. ధురంధర్ 2 ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రాన్ని మలిచారు" అని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
బాక్సాఫీస్ వద్ద భారీ పోరు
రణవీర్ సింగ్ నటించిన ఈ గూఢచారి డ్రామా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురుకానుంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా కూడా అదే సమయంలో విడుదల కానుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications