చంద్రబాబును కలవబోతున్న జూనియర్ ఎన్టీఆర్?
ప్రకృతి విపత్తుతో రెండు తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లిపోతున్నాయి. మున్నేరు వాగు ముంచెత్తడంతో ఖమ్మం పట్టణం జలదిగ్బంధమవడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలసంఖ్యలో నిరాశ్రయులయ్యారు. అలాగే బుడమేరు వాగు విజయవాడ పట్టణాన్ని ముంచెత్తడంతో సగం విజయవాడ నీటిలోనే ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దగ్గరుండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకోవడానికి సినీ, రాజకీయ రంగాలతోపాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.
అండగా ఉండాలనే ఉద్దేశంతోనే..
వీరంతా తమకు తోచినంతరీతిలో ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. అందరికమంటే ముందుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కోటిరూపాయల విరాళాన్ని ప్రకటించారు. వరదవల్ల సంభవించిన విపత్తు నుంచి రెండు రాష్ట్రాలు కోలుకోవడానికి ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో విరాళాన్ని ప్రకటించానని సామాజిక మాధ్యమాలద్వారా వెల్లడించారు. త్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి దీనికి సంబంధించిన చెక్కులను అందజేస్తున్నారు.

చంద్రబాబును కలవడమే ప్రాముఖ్యత
రేవంత్ రెడ్డిని కలవడంకన్నా చంద్రబాబును కలవబోవడం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. చంద్రబాబును జైల్లో పెట్టిన సమయంలో కూడా తారక్ స్పందించకుండా మౌనంగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపొంది సీఎం అయిన తర్వాత మాత్రం ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి చంద్రబాబు కూడా తిరిగి సమాధానమిచ్చారు. ప్రస్తుతం తారక్ చంద్రబాబును కలవబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే నిజమైతే సూపర్ గా ఉంటుందంటూ తారక్ అభిమానులతోపాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వరద సహాయక చర్యలు ముగిసిన తర్వాత చంద్రబాబును కలిసే అవకాశం ఉందంటున్నారు. కలుస్తారా? లేదంటే కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వార్త పుకారేనా అనేది త్వరలోనే తేలిపోతుంది.












Click it and Unblock the Notifications