Fact Check : కేంద్రం ఉద్యోగుల డీఏని పునరుద్దరించిందా... ఆ ఉత్తర్వుల్లో నిజమెంత..?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ(Dearness allowance),డీఆర్(Dearness relief)లను పునరుద్దరించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ లేఖ వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది.ఆ లెటర్ ఫేక్ అని తేల్చి చెప్పింది.
'కరోనా కాలంలో స్తంభింపజేసిన డీఏ,డీఆర్‌లను జులై 1,2021 నుంచి తిరిగి పునరుద్దరించనున్నాం. జులై 1,2020 నుంచి ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏ,డీఆర్ బకాయిలను మూడు వాయిదాల్లో చెల్లిస్తాం.' అని కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ టీవీ సోమనాథన్ పేరుతో ఆ ఫేక్ లెటర్‌లో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,ఆర్మీ జవాన్లకు ఏడాది కాలంగా డీఏ,డీఆర్‌లు నిలిపివేసింది వాస్తవమే. దీన్ని తిరిగి పునరుద్ధరించాలని ప్రతిపక్షాలు,ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సైనికులకు డీఏ రూపంలో చెల్లించాల్సిన రూ.37,500 కోట్లు కేంద్రం లూటీ చేయడం దారుణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

ఏడవ వేతన కమిషన్ సిఫారసుల మేరకు ఈ ఏడాది డీఏ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్నారు. దీనిపై ఈరోజు నిర్ణయం వెలువడుతుందన్న కథనాలు కూడా వచ్చాయి. కానీ అలాంటి ప్రకటనేమీ రాకపోగా... ఫేక్ లెటర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఆ లేఖను నమ్మవద్దు.


Fact Check
వాదన
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్ర ప్రభుత్వం పునరుద్దరించింది.
వాస్తవం
ఇప్పటివరకూ అలాంటి నిర్ణయమేదీ కేంద్రం తీసుకోలేదు.












Click it and Unblock the Notifications